Fri Dec 05 2025 15:25:09 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : మరో రెండు రోజులు ఇంతే...భారీ నుంచి అతి భారీ వర్షాలు తప్పవు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఈ వర్షాలు పడతాయని తెలిపింది. ఈరోజు వాయుగుండం అల్పపీడనంగా మారే అవకాశముందని కూడా తెలిపింది. ఈ ప్రభావంతో రెండు తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అలెర్ట్ గా ఉండాలని, అదే సమయంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థతిని సమీక్షించుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇప్పటికే అన్ని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులు నీటి కుండలు తలపిస్తున్నాయి.
తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్...
తెలంగాణలోనూ రాగల రెండు రోజుల పాటు భఆరీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి, సిద్ధిపేట్, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా్లో భారీ వర్షాలు పడతాయని చెప్పి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రభుత్వం ముప్పయి మూడు జిల్లాలకు డిజాస్టర్ మేనేజ్ మెంట్ శాఖకు 33 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
ఏపీలోనూ రెండు రోజులు...
ఆంధ్రప్రదేశ్ లోనూ రెండు రోజుల పాటు వాయుగుండం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. బలమైన గాలులు వీస్తాయని, నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని కూడా విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్లు,టవర్స్,పోల్స్, పొలాలు,బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరించింది.
Next Story

