Thu Jan 01 2026 06:59:08 GMT+0000 (Coordinated Universal Time)
Cold Waves : టెంపరేచర్స్ మైనస్ కు పడిపోతాయా? ఏంది
మరో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఇదే రకమైన చలిగాలుల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు

చలిగాలుల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. మరికొన్ని రోజుల పాటు చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గత నెల రోజుల నుంచి చలితీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఉత్తరాది నుంచి మొదలు పెడితే దక్షిణాది వరకూ అన్ని ప్రాంతాల్లో గడ్డకట్టుపోయే పరిస్థితి నెలకొంది. చేతుల కొంకర్లు పోతున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో అనేక మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇంట్లో ఉన్నప్పటికీ చలితీవ్రతకు ఇబ్బందులు పడుతున్నారు. బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. మరో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఇదే రకమైన చలిగాలుల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
పొగమంచుతో...
ఆంధ్రప్రదేశ్ లోనూ చలితీవ్రత ఎక్కువగా ఉంది. పొగమంచు కూడా ఉదయం తొమ్మిది గంటల వరకూ వీడటం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అర్ధరాత్రి సమయంలో మైనస్ డిగ్రీలకు కూడా పడిపోయే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. అలాగే ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్రలోనూ చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. రాయలసీమలోనూ చలి ఎక్కువగా కనపడుతుంది. దీంతో అన్ని ప్రాంతాల ప్రజలు చలిగాలుల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో పొగమంచు వల్ల ప్రయాణాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది.
సాధారణంకంటే...
ఇక తెలంగాణలో చలి తీవ్రత మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణలో చలితీవ్రత పెరిగింది. అనేక జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ దాటడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చలిమంటలతో తమ శరీరాన్ని వెచ్చబుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో విద్యుత్తు వినియోగం కూడా గణనీయంగా తగ్గింది. ఉదయం, రాత్రి వేళల్లో ఫ్యాన్లు వేసుకోవడానికి కూడా భయపడిపోతున్నారు. చలికి గజగజ వణికపోతున్నారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీలో 5.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Next Story

