Sat Dec 27 2025 06:09:28 GMT+0000 (Coordinated Universal Time)
Cold Winds : ప్రయాణాలు నాలుగు రోజులు వాయిదా వేసుకోండి.. లేకుంటే ప్రమాదమే
Cold Winds : ప్రయాణాలు నాలుగు రోజులు వాయిదా వేసుకోండి.. లేకుంటే ప్రమాదమే

చలి కొంత వరకూ ఆనందం ఇస్తుంది. శరీరం వెచ్చదనాన్ని కోరుకుంటుంది. కానీ గత పదిహేను రోజుల నుంచి పైగానే ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఇంకెంత కాలం ఈ చలితీవ్రత కొనసాగుతుందో తెలియదు. సాధారణంగా శివరాత్రి వరకూ చలితీవ్రత ఉంటుందని పెద్దలు చెబుతారు. అంటే శివరాత్రికి ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పటికే మరికొన్ని రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో చలితీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నాలుగు రోజుల పాటు చలితీవ్రత మరింత పెరగుతుందని అంచనాలు వినిపిస్తున్నాయి. మరొక నాలుగు రోజుల పాటు ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి.
కనిష్ట స్థాయికి...
ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. కొన్ని ప్రాంతాలలో తొమ్మిది సెంటీగ్రేటెడ్ డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం వేళ పొగమంచుతో పాటు చలిగాలుల తీవ్రత కూడా అధికంగానే ఉంది. ఉదయం పది గంటల వరకూ చలి తీవ్రత తగ్గడం లేదు. అలాగే చలిగాలుల జోరు కూడా ఎక్కువగా ఉంది. ఉదయం, రాత్రి వేళల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారిందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ప్రజలు అవసరమైతే తప్ప ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావద్దని చెబుతున్నారు. అనేక మంది జలుబు, జ్వరం, దగ్గు వంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే దీర్ఘకాలికంగా వ్యాధులున్న వారు ఇళ్లలోనే ఉండటం మంచిదని సూచిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలే కాదు.. అన్ని ప్రాంతాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉంది.
సింగిల్ డిజిట్ కు పడిపోయి...
తెలంగాణలో చలి సంగతి వేరే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణలో గత పదేళ్లలో ఇంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు ఎన్నడూ పడిపోలేదు. ప్రధానంగా కుమ్రభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉంది. ఈ జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి నుంచి కాపాడుకోవడానికి ప్రజలు చలిమంటను ఆశ్రయిస్తున్నారు. ప్రధానంగా గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా చలితీవ్రత ఎక్కువగా ఉంది. ప్రజలు చలికాలంలో శరీరంలో నీటి శాతాన్ని తక్కువ కాకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ కు గురి కాకుండా శరీరాన్ని ఎప్పటికప్పుడు నీరు తాగుతూ కాపాడుకోవాలని చెబుతున్నారు.
Next Story

