Mon Jan 26 2026 05:56:33 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : చలి పోయింది... ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయ్
వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది.

వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది. రెండు రాష్ట్రాల్లో చలితీవ్రత తగ్గింది. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం పది గంటల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం ఇరవై ఐదు నుంచి ముప్ఫయి డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఇక శివరాత్రి తర్వాత మరింత గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా చలి తీవ్రత కొనసాగుతున్నప్పటికీ గతంలో మాదిరిగా సింగిల్ డిజిట్ లో మాత్రం ఉష్ణోగ్రతలు నమోదు కావడం లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
పగటి వేళలో...
ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే వేడి గాలులు ప్రారంభమయ్యాయి. వేడి వాతావరణం పగటి వేళ కనిపిస్తుంది. రాత్రి వేళ కొంత చలితీవ్రత కనిపిస్తున్నప్పటికీ మధ్యాహ్నం మాత్రం చెమటతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోత కూడా మొదలయింది. కోస్తా తీర ప్రాంతంలో ఉక్కపోత అధికంగా ఉంది. కొంత ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం ఇంకా చలి గాలులు కొనసాగుతున్నాయి. అయితే గతంలో మాదిరిగా చలి తీవ్రత లేదు. ఏజెన్సీ ప్రాంతాలైన అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పదిహేను నుంచి ఇరవై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
పెరుగుతున్న విద్యుత్తు వినియోగం...
తెలంగాణలో కూడా చలితీవ్రత చాలా వరకూ తగ్గింది. ప్రస్తుతం ఈరోజు పొడి వాతావరణం నెలకొందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. చలి తీవ్రత తగ్గడంలో ప్రస్తుతం విద్యుత్తు వినియోగం కూడా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఫ్యాన్లు ఉదయం నుంచి తిరుగుతుండటంతో కొంత విద్యుత్తు మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. ఇక ఏజెన్సీ ప్రాంతాలైన ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ కొంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ లాంటి ప్రాంతంలోనూ చలితీవ్రత తగ్గింది. అయితే ఉదయం ఎనిమిది గంటల వరకూ దట్టమైన పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు కొంత ఇబ్బంది పడుతున్నారు.
Next Story

