Tue Feb 10 2026 22:54:27 GMT+0530 (India Standard Time)
Congress : మీనాక్షి తెలంగాణ ఇన్ ఛార్జిగా ఉన్నారా? లేదా? పెద్ద డౌటే
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ లో జరుగుతున్న వ్యవహారాలను పట్టించుకోవడం లేదనిపిస్తోంది

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ లో జరుగుతున్న వ్యవహారాలను పట్టించుకోవడం లేదనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వివిధ చోట్ల రెబెల్స్ నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ ఎలాంటి చర్యలకు ఆమె దిగడం లేదు. పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో మీనాక్షి నటరాజన్ నానుస్తున్నారని అన్నారు. కనీసం మీనాక్షి నటరాజన్ రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలను హైకమాండ్ కు అసలు చెబుతున్నారా? లేదా? అన్న అనుమానం కూడా ఉంది. ఆమె ఏదో ఇన్ ఛార్జిగా ఉన్నట్లే ఉంటున్నారు తప్పించి ఎలాంటి కఠిన నిర్ణయాల వంటి జోలికి వెళ్లడం లేదు. దీనిని అలుసుగా తీసుకుని కాంగ్రెస్ నేతలు కొందరు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రాహుల్ కోటరీలో నేత అయినా...
మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ కోటరీలో వ్యక్తి అంటారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటారనే ఆమెను తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జిగా నియమించారు. మీనాక్షి నటరాజన్ చాలా సింపుల్ గా ఉంటారు. గతంలో ఇన్ ఛార్జుల మాదిరిగా మీనాక్షి పార్టీ బలోపేతానికి తప్పించి మరే ఆలోచన చేయరు. తెలంగాణకు వస్తే హంగు ఆర్భాటాలను కూడా ప్రదర్శించరు. స్టార్ హోటల్స్ బస చేయరు. అలాగే ఏ స్థాయి నేత ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్ అవుతారు. అలాంటి మీనాక్షి నటరాజన్ గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై ఆమె స్పందించకపోవడం, పార్టీ అగ్ర నాయకత్వానికి కూడా తెలియజేయకపోవడంపైనే ఇప్పుడు గాంధీ భవన్ లో చర్చ జరుగుతుంది.
బుజ్జగించే ప్రయత్నం కూడా...
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కానీ, పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి అసలు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళుతున్నారా? లేదా? అన్న అనుమానం కూడా నేతల్లో ఉంది. జీవన్ రెడ్డి వ్యవహారం తీసుకుంటే అది వెంటనే హైకమాండ్ కు చేరవేయాలి. ఆయన దశాబ్దాలుగా పార్టీలో ఉన్న నేత అని మీనాక్షికి తెలుసు. కనీసం ఆయన వద్దకు వెళ్లి మాట్లాడే ప్రయత్నం కూడా మీనాక్షి చేయలేదు. అంటే రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు పర్చేదానికి ఇక ఇన్ ఛార్జి ఎందుకన్న సందేహం సాధారణంగా కార్యకర్తల్లోనూ వ్యక్తమవుతుంది. అప్పుడప్పుడు ఇలా వచ్చి అలా మౌనంగా మీనాక్షి నటరాజన్ వెళ్లిపోతుంటే పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టులా తయారవుతుందన్న ఆందోళన కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతుంది.
Next Story

