Fri Dec 05 2025 13:52:44 GMT+0000 (Coordinated Universal Time)
Congress : రాహుల్ కోటరీకి కూడా కాంగ్రెస్ నేతలు భయపడటం లేదా?
ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ ను అధినాయకత్వం నియమించినప్పటికీ నేతల్లో మాత్రం మార్పు కనిపించడం లేదi

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి పదేళ్ల తర్వాత వచ్చింది. అయితే అధికారాన్ని నిలబెట్టుకోవాల్సిన నేతలు వీధిన పడుతున్నారు. చిల్లర గొడవలకు దిగుతున్నారు. అయితే పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ ను అధినాయకత్వం నియమించినప్పటికీ నేతల్లో మాత్రం మార్పు కనిపించడం లేదని పిస్తుంది. గతంలో ఉన్న ఇన్ ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షీని తొలగించిన పార్టీ నాయకత్వం గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే మీనాక్షి నటరాజన్ ను ఇన్ ఛార్జిగా నియమించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన మంత్రులే గొడవ పడుతుండటం కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను అయోమయానికి గురి చేసింది.
నేతల్లో సఖ్యత కొరవడి...
దీంతో మీనాక్షి నటరాజన్ కు కూడా నేతలు వెరవకుండా తమకు తోచినట్లే వ్యవహరిస్తున్నారంటున్నారు. నేతల్లో సఖ్యత కొరవడింది. ప్రభుత్వంలో మంత్రుల మధ్య కూడా సమన్వయం కనిపించడం లేదు. చిన్న చిన్న వాటికి వారు గొడవలకు దిగుతున్నారు. మీడియాకు ఎక్కుతున్నారు. మంత్రుల తీరుపై పార్టీ నాయకత్వం ఆగ్రహంగా ఉందని అంటున్నా మీనాక్షి నటరాజన్ మాత్రం ఎలాంటి నష్టనివారణ చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినపిస్తున్నాయి. ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగే అవకాశముండటంతో వరసగా మంత్రులు గొడవలకు దిగడం పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు.
కీలకమైన నేత అయినా...
మీనాక్షి నటరాజన్ రాహుల్ కోటరీలో కీలకమైన నేత కావడంతో ఆమె పార్టీని సెట్ చేశారని అనుకున్నారు. ఆమె సాదాసీదాగానే ఉంటున్నారు. జీవనశైలి ఇక్కడ ముఖ్యం కాదు. పార్టీని గాడిలో పెట్టడం ముఖ్యమన్నది మీనాక్షి నటరాజన్ మర్చిపోతు న్నారన్నకామెంట్స్ వినపడుతున్నాయి. మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ లో బయోకెమిస్ట్రీలో పీజీ చేశారు. ఇండోర్ లో చదువుకుంటూనే రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ సింప్లిసిటీని చూసి ఆమె కూడా అదే పార్టీని ఎంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి అనుబంధ విభాగమైన ఎన్.ఎస్.యూ.ఐ లో పనిచేశారు. తర్వాత 2008లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
ఎమ్మెల్యేలు కూడా...
2009 ఎన్నికల్లో మందసౌర్ నుంచి పోటీ చేసి మీనాక్షి నటరాజన్ విజయం సాధించారు. గతంలో 2024, 2019 ఎన్నికల్లో ఓటమి పాలయి 2024 లో విజయం సాధించి ఎంపీగా ఎన్నికయ్యారు. రాహుల్ టీం లో ఒక సభ్యురాలిగా చేరారు. రాహుల్ గాంధీకి నమ్మకమైన నేతగా పేరుపొందారు. అయినా సరే నేతలు మాత్రం ఎటువంటి జంకు లేకుండా పార్టీ పరువును వీధికెక్కిస్తున్నారు. మంత్రులే కాదు ఎమ్మెల్యేలు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీని ఇరకాటంలోకి నెడుతున్నారు. మీనాక్షి నటరాజన్ నేరుగా ఇక్కడి విషయాలను రాహుల్ గాంధీకి చేరవేసే చొరవ ఉన్నప్పటికీ ఆమె ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రోజుకో రగడ పార్టీని ప్రజల్లో నవ్వుల పాలు చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేళ్ల పాటు అధికారంలో కాంగ్రెస్ ఉంటుందని చెబుతున్నప్పటికీ పార్టీ నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
Next Story

