Sat Dec 06 2025 14:00:42 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు...ఎవరెవరికీ ఛాన్స్ అంటే?
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయింది

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయింది. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు అధినాయకత్వంతో చర్చించిన అనంతరం విస్తరణకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలిసింది. తెలంగాణ కేబినెట్ లో మొత్తం ఆరు ఖాళీలు ఉండగా అందులో ప్రస్తుతం ఐదింటిని భర్తీ చేయడానికి హైకమాండ్ అంగీకరించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చినప్పటికీ విస్తరణకు ముహూర్తం మాత్రం ఇంకాఖరారు కాలేదు. శుభముహూర్తాలు ఈ నెల మొదటి వారంతో ముగియనుండటంతో ఈ రోజు విస్తరణ జరిగే అవకాశముందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీతో చర్చించిన అనంతరం విస్తరణకు రెడీ అయినట్లు సమాచారం.
ఆశావహులు ఎక్కువే...
బీసీ సమాజికవర్గం నుంచి ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. రెడ్డి సామాజికవర్గం నుంచి కూడా ఇద్దరి పేర్లు ఉన్నాయి. ఎస్టీ సామాజికవర్గం కింద బాలూ నాయక్ పేరు ఖరారయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇక రెడ్డి సామాజికవర్గంలో సుదర్శన్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తున్నా ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేకపోవడంతో సుదర్శన్ రెడ్డికే అవకాశాలున్నాయంటున్నారు. మరొక వైపు ఎస్సీ సామాజికవర్గం కింద గడ్డం వివేక్ పేరు కూడా పరిశీలనలో ఉంది. గడ్డం వివేక్ కు మంత్రి పదవి ఇస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా ఇవ్వాల్సి వస్తుందని భావిస్తే ఆయన స్థానంలో మరొకరికి అవకాశం దక్కే ఛాన్సు ఉందని అంటున్నారు.
బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని...
బీసీ కోటాలో వాకిటి శ్రీహరి, ఆది శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అందుకు అనుగుణంగా మంత్రివర్గంలో ఎంపిక చేయాలని కూడా అధినాయకత్వంతో రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలిసింది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాలకు కూడా కేబినెట్ లో ప్రాతినిధ్యం కల్పించాలన్న డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుంది. అయితే దీనిపై ఇంకా నిర్ణయం జరగలేదంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్లు కావస్తుండగా ఇప్పటి వరకూ విస్తరణ జరగక పోవడంతో నాయకుల్లోనూ, ఆశావహుల్లోనూ అసంతృప్తి ఎక్కువగా ఉంది. మల్లికార్జున ఖర్గే తో సమావేశం జరిగిన తర్వాత ముహూర్తం విస్తరణకు ఫిక్స్ అయ్యే అవకాశాలున్నాయని తెలిసింది. మరోసారి ఈ నెల 30వ తేదీన ఢిల్లీకి వెళ్లి ముహూర్తాన్ని నిర్ణయించనున్నారు.
Next Story

