Mon Jan 19 2026 13:47:15 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : కొమురవెల్లి మల్లన్న జాతర కు వెళ్లొద్దామా?
తెలంగాణలో జరిగే ప్రసిద్ధమైన జాతరల్లో కొమురవెల్లి మల్లన్న స్వామి జాతర ఎంతో ప్రసిద్ధి చెందింది

తెలంగాణలో జరిగే ప్రసిద్ధమైన జాతరల్లో కొమురవెల్లి మల్లన్న స్వామి జాతర ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది అచ్చ జానపదుల జాతర. సంక్రాంతి తర్వాత వచ్చే తొలి ఆదివారం నాడు మల్లన్న జాతర ప్రారంభం కానుంది. కల్యాణోత్సవం, శకటోత్సవాలతో ప్రారంభమమయింది. సంక్రాంతి తరువాత వచ్చే ఆదివారంతో ప్రతి సంవత్సరం ఆరంభమయ్యే జాతర మూడు నెలలపాటు ప్రతి ఆదివారం జరుగుతుంది. ఉగాదికి ముందు వచ్చే ఆదివారం నాడు ముగుస్తుంది. బోనాలు, అగ్నిగుండాలు వంటి వేడుకలతో జానపదులు స్వామిని మెప్పిస్తారు. ఈ కొమురవెల్లి క్షేత్రం సిద్దిపేట జిల్లాలో ఉంది. హైదరాబాద్ నుంచి 88 కిలోమీటర్ల దూరంలో ఉంది.
శివుని అవతారంగా...
ఇక్కడ మల్లన్నను శివుని అవతారంగా కొలుస్తారు. అంతేకాదు మల్లన్న శివుని కొడుకు అని.. ఎల్లమ్మకు తమ్ముడు అని మల్లన్న కథలో వస్తుంది. మల్లన్న బోనంలో బెల్లం, బియ్యం సమర్పిస్తారు. బలి సమర్పణలు ఈ ఆలయంలో ఉండవు. మల్లన్న సంప్రదాయంలో పూజ అంతా కూడా తెలుగు సంప్రదాయం ప్రకారం ఉంటుంది. భక్తి శ్రద్ధలతో కొలిచిన వారిని మల్లిఖార్జున స్వామి అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం. ఇక కొమురవెల్లి జాతర ఉగాది వరకూ కొనసాగుతుంది. అలాగే మహా శివరాత్రి రోజుల్లో అగ్నిగుండం కూడా ఉంటుంది.
ఇతర రాష్ట్రాల నుంచి...
ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. హైదరాబాద్ నుంచి కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. అందుకే తొలి ఆదివారాన్ని పట్నం వారంగా పిలుస్తుంటారు. అలాగే, సోమవారం తోటబావి సమీపంలోని కల్యాణ వేదిక దగ్గర సొంత ఖర్చులతో పట్నం, అగ్నిగుండం కార్యక్రమాలు జరుపుతారు. ఈ వేడుకకు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది ఆలయానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story

