Fri Mar 06 2026 11:11:52 GMT+0530 (India Standard Time)
Telangana :Telangana : మహబూబాబాదం జిల్లాలో గిరిజన జాతర కోలాహలం
మహబూబాబాద్ జిల్లాలో గిరిజనుల జాతర మొదలయింది

మహబూబాబాద్ జిల్లాలో గిరిజనుల జాతర మొదలయింది. నిండు పున్నమి కాంతుల్లో అడవి తల్లి పులకిస్తోంది. డోలు వాయిద్యాల మోత, శివసత్తుల పూనకాల మధ్య మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడ గ్రామంలో వెలిసిన 'కొమ్మాలమ్మ' జాతర భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. మేడారం సమ్మక్క-సారలమ్మల తరహాలోనే గిరిజనులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే ఈ వనదేవతకు 11వ శతాబ్దం నాటి ఘనమైన చరిత్ర ఉంది. సాధారణంగా దైవం అంటే విగ్రహ రూపంలో ఉంటారు. కానీ, కొమ్మాలమ్మ తల్లి ఇక్కడ కత్తి రూపంలో దర్శనమివ్వడం ఒక విశిష్టమైన సంప్రదాయం. ఆదివాసీ దేవతలందరిలో కెల్లా పెద్ద దేవతగా కొమ్మాలమ్మను కొలుస్తారు. ఒకప్పుడు గోదావరి తీరంలో వెలిసిన ఈ తల్లి, కాలక్రమేణా 'వాసం' వంశీయుల ఆరాధ్య దైవంగా ఎంచగూడ ప్రాంతానికి చేరుకుంది. ఈ దైవానికి యాలం,
ప్రకృతిని తెలియజేసే...
ఆలూరి వంశీయులు ప్రధాన పూజారులుగా వ్యవహరిస్తారు. పూర్వం ఈ ఖడ్గాన్ని తిరిగి గోదావరి ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేయగా, అరిష్టాలు సంభవించడంతో భక్తులు భయపడి తిరిగి ఎంచగూడలోనే ప్రతిష్టించారని చరిత్ర చెబుతోంది.కొమ్మాలమ్మ కేవలం దేవత మాత్రమే కాదు, ఆదివాసీల పాలిట ఒక ప్రకృతి శాస్త్రవేత్తగా విరాజిల్లుతోంది. రాబోయే ఏడాది వర్షాలు ఎలా ఉంటాయో తల్లి ముందే హెచ్చరిస్తుందని భక్తుల నమ్మకం. గద్దెపై ఉన్న ఖడ్గానికి తగిలించిన వెండి కంకణాలు కదిలి గలగలమంటూ శబ్దం చేస్తే ఆ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, ఒకవేళ కంకణాలు బిగుసుకుపోయి నిశ్శబ్దంగా ఉంటే వర్షాలు తక్కువని గిరిజనులు భావిస్తారు. వర్షాలు లేని సమయంలో ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేస్తే కచ్చితంగా వానలు కురుస్తాయని వారి ప్రగాఢ విశ్వాసం. అందుకే అత్యంత భక్తి విశ్వాసాలతో దీనిని జరపుకుంటారు.
వెండి కంకణాలే...
సమ్మక్క సారలమ్మలకు బెల్లాన్నిసమర్పించినట్లుగా, కొమ్మాలమ్మ తల్లికి వెండి కంకణాన్ని కానుకగా సమర్పించడం ఇక్కడి ప్రధాన ఆచారం. ముఖ్యంగా సంతానం లేని వారు తల్లిని వేడుకుంటే ఫలితం నిశ్చయమని భక్తుల నమ్మకం. కోరిక తీరిన దంపతులు తమ కృతజ్ఞతగా తల్లికి వెండి కంకణాలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.ప్రతి రెండేళ్లకు ఒకసారి కోనాపురం అడవుల నుండి సేకరించిన ప్రత్యేక వెదురు కంకలు, ఎర్రని జెండాలు ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సమ్మక్క బండారి వంశానికి చెందిన వారు కాగా, కొమ్మాలమ్మ కూడా అదే బండారి వంశీయుల మహాశక్తిగా పూజలందుకోవడం విశేషం. అగ్ని రూపంలో గద్దెపైకి చేరే వనదేవత, అడవి బిడ్డల కష్టాలను తీర్చే కల్పవల్లిగా వెలుగొందుతోంది.
Next Story

