Wed Dec 24 2025 08:32:09 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : రెండు చేతులూ సరిపోయాయా.. సామీ.. ఇన్ని ఆస్తులా? కిలోల బంగారం.. భూములే భూములు
అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీల్లో డీటీసీ కిషన్ నాయక్ భారీగా ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించారు.

తెలంగాణలో మరో అవినీతి తిమింగలం బయటపడింది. అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీల్లో డీటీసీ కిషన్ నాయక్ భారీగా ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించారు. అధికారుల సమచారం మేరకు కిషన్ నాయక్ ఆస్తుల విలువ నాలుగు వందల కోట్ల రూపాయలకు పైమాటేనని చెబుతున్నారు. కిలోల కొద్దీ బంగారం, విలువైన భూములతో పాటు ప్లాట్లు, ఫ్లాట్లు ఇలా అనేక ఆస్తులు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. ఈరోజు కూడా కిషన్ నాయక్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. మొత్తం పదకొండు ప్రాంతాల్లో ఈ సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు కిషన్ నాయక్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
సన్నిహితుల ఇళ్లలో...
సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని కిషన్ నాయక్ ఇంట్లోతో పాటు రాజరాజేశ్వరినగర్ లో ఉన్న ఇంటిలోనూ సోదాలు జరిపారు. మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్ గా రవాణాశాఖలో కిషన్ నాయక్ పనిచేస్తున్నారు. ఆయనపై అనేక ఆరోపణలు రావడంతో అవినీతి తిమింగలం అని గుర్తించిన ఏసీబీ అధికారులు పకడ్బందీగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో కిషన్ నాయక్ ఆస్తులను చూసి అధికారులే విస్తుపోయారు. కిషన్ నాయక్ తనపై ఎప్పుడైన ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించవచ్చని భావించి ముందుగానే జాగ్రత్త పడ్డారు. బంగారాన్ని ఒక జ్యుయలరీ దుకాణాలో దాచి ఉంచారు. నిజామాబాద్ లో ఒక హోటల్ కూడా ఉన్నట్లు గుర్తించారు
అనేక చోట్ల ఆస్తులను...
అలాగే తనకు సంబంధించిన విలువైన ఆస్తిపత్రాలను రెండు సూట్ కేసుల్లో భద్రపర్చి తనకు అత్యంత సన్నిహితులైన వారి ఇంట్లో ఉంచారు. అయితే ఈ సమాచారాన్ని సేకరించిన ఏసీబీ అధికారులు కిషన్ నాయక్ సన్నిహితుల ఇళ్లలో సోదాలు జరిపి ఒక సూట్ కేసులో భద్రపర్చిన 26 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, మహబూబ్ నగర్ ప్రాంతాలలో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఏసీబీ చరిత్రలోనే ఇది అత్యంత రికార్డు స్థాయిలో అక్రమాస్తులు వెల్లడయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఆస్తుల విలువ నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని చెబుతున్నారు.
Next Story

