Fri Jan 30 2026 04:05:15 GMT+0000 (Coordinated Universal Time)
KCR : సిట్ నోటీసులకు కేసీఆర్ లేఖ.. తాను హాజరుకాలేనంటూ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణపై కేసీఆర్ స్పందించారు

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణపై కేసీఆర్ స్పందించారు.ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో తాను విచారణకు హాజరయ్యేందుకు ఈరోజు కుదరదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఈ కేసులో విచారణకు అందుబాటులో ఉండాలని సిట్ అధికారులు నిన్న నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే సిట్ జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. సిట్ నోటీసుల్లో పేర్కొన్నట్లుగా తాను శుక్రవారం హాజరు కాలేనని తెలిపారు. మరొక రోజు వచ్చేందుకు తాను సిద్ధమని తెలిపారు. కేసీఆర్ ఇప్పటికే దీనికి సంబంధించి జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాశారు.
మున్సిపల్ ఎన్నికలున్నందున...
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నందున, నేడు నామినేషన్లకు చివరి రోజు కావడంతో తాను హాజరు కాలేదని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతన్నాయని, బీఆర్ఎస్ పార్టీ అధినేతగా తాను కొన్ని ముఖ్యమైన ఫారాలపై సంతకాలు చేయాల్సి ఉన్నందున శుక్రవారం విచారణకు హాజరు కాలేనని తేల్చి చెప్పారు. తాను శుక్రవారం హైదరాబాద్ లోనే కాదు.. ఎక్కడా హాజరు కాలేనని కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈరోజు కాకుండా ఏ రోజు వచ్చి అయినా తనను విచారణ చేసుకో వచ్చని లేఖలో పేర్కొన్నారు.
ఎర్రవెల్లికి వచ్చి...
అయితే తాను హైదరాబాద్ కు రావడం లేదని, మరో రోజు ఎప్పుడైనా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వచ్చి తనను విచారించుకోవచ్చని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం తనకు అనుకూలమైన తేదీని ముందుగానే నిర్ణయించి తెలియజేయాలని అన్నారు. ప్రస్తుతం తాను సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలో నివాసముంటున్నానని అక్కడకు వచ్చి విచారించుకోవచ్చని, అయితే ముందుగా ఇచ్చిన నోటీసుల మేరకు ఈ రోజు మాత్రం తాను విచారణకు రాలేనని,అలాగని తాను చట్టానికి కట్టుబడి ఈ కేసులో విచారణకు సహకరిస్తానని తెలిపారు. దీంతో నేడు కేసీఆర్ విచారణను సిట్ అధికారులు చేపట్టనన్నట్లు తెలిసింది. మరొక సారి నోటీసులు ఇచ్చే విచారణ చేసే అవకాశముంది.
Next Story

