Mon Mar 09 2026 19:53:57 GMT+0530 (India Standard Time)
KCR : ఏమయ్యా పెద్దమనిషీ.. చెప్పి ఎన్నిరోజులయింది? ఏ మయింది?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన పని ఒక్కటీ చేయరు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన పని ఒక్కటీ చేయరు. అందుకే ఆయనపై ప్రజల్లో నమ్మకం లేదన్నది వాస్తవం. ఆర్భాటపు ప్రకటనలు, తర్వాత మౌనం.. కేసీఆర్ విషయంలో మామూలుగా మారింది. ఈ ఏడాది జనవరి నెలలో హడావిడిగా తెలంగాణ భవన్ లో సమావేశాన్ని ఏర్పాటు చేసి నేతలతో చర్చించారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పై భారీ బహిరంగ సభలను పెడతామని చెప్పారు. కేసీఆర్ పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేదని ప్రస్తావిస్తూనే ఇరు రాష్ట్రాలకు సంబంధించి కృష్ణా నీటి పంపకాల విషయంలో అన్యాయం జరుగుతుందన్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో భారీ బహిరంగ సభలను త్వరలో ఏర్పాటు చేస్తానని, తాను కూడా హాజరవుతానని చెప్పారు.
పాలమూరు - రంగారెడ్డి పథకంపై సభలంటూ...
జనవరి నెలలో ఆర్భాటంగా మీడియా సమావేశాన్ని పెట్టిన కేసీఆర్ ఆ తర్వాత తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మూడు జిల్లాల నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సభకు తాను కూడా హాజరవుతానని చెప్పడంతో నేతలు కూడా సిద్ధమయ్యారు. అయితే ఇంత వరకూ సభలు పెట్టిన పాపాన పోలేదు. అసలు తాను ఆ విషయాన్ని చెప్పినట్లు కూడా కేసీఆర్ కు గుర్తు ఉంటుందని అనుకోవడానికి వీలులేదు. ఆ రోజు తర్వాత తిరిగి కేసీఆర్ పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మాట మాత్రం కూడా మాట్లాడలేదు. అసలు సీరియస్ గా ఒక ఆరోపణ చేసినప్పుడు దానికి కట్టుబడి ఉండాల్సిన పార్టీ అధినేత అలవోకగా అలా చెప్పేసి ఆ తర్వాత దానిని మర్చి పోవడం అలవాటుగా మార్చుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఊసే లేకపోతే ఎలా?
గత ఎన్నికలలో ఈ మూడు జిల్లాల్లో బీఆర్ఎస్ భారీగా దెబ్బతినింది. దీంతో అక్కడ నేతలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో తమకు కలసి వస్తుందని భావించారు. కానీ కేసీఆర్ తిరిగి ఆ ఊసే ఎత్తలేదు. నీళ్ల వివాదాన్ని తెచ్చి ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారనుకుంటే తమ పార్టీ అధినేతకు ఆ మాత్రం సమయం ఉంటుందని తాము అనుకోవడం లేదని కూడా చమత్కరిస్తున్నారు. నిజంగా అధికార పార్టీపై నీటి యుద్ధమే చేయాలంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చుంటే ఎలా అన్న ప్రశ్నలు నేతల నుంచి, గులాబీ పార్టీ కార్యకర్తల నుంచి జోరుగా వినిపిస్తున్నాయి. చెప్పిన మాట మీద నిలడకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడంతా ఫామ్ హౌస్ లో ఉండి ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వస్తే జనం నమ్ముతారా? అన్న సందేహాలు కూడా నేతలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కు ఇది కొత్త కాదు.. ఎన్నోసార్లు ప్రకటనలు ఆర్భాటంగా చేయడం, తర్వాత దానిని మర్చిపోవడం అలవాటేనని సర్ది చెప్పుకుంటూ నేతలు తమ బాధను తమలోనే దిగమింగుకుంటున్నారు.
Next Story

