Tue Feb 17 2026 12:46:36 GMT+0530 (India Standard Time)
KCR : ఉద్యమ నేత కేసీఆర్ జన్మదినం నేడు.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల సంబరాలు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు 72వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు 72వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. దీంతో ఈరోజు ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు ఆయన రాజకీయ ప్రస్థానం, నాయకత్వాన్ని గుర్తుచేసుకుంటూ కార్యక్రమాలు చేపడుతున్నారు. 1954 ఫిబ్రవరి 17న సిద్ధిపేట జిల్లా చింతమడక గ్రామంలో జన్మించిన కేసీఆర్ యువ కాంగ్రెస్‌తో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 80 దశకంలో కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారు. డిప్యూటీ స్పీకర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. 1970ల చివరలో జరిగిన తొలి సారిగా ఎన్నికయ్యారు. 2023లో కామారెడ్డి నుంచి పోటీ చేసిన సందర్భం మినహా నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన ఓటమి చూడలేదు.
ఇరవై ఐదేళ్ల క్రితం...
2001లో తెలంగాణ రాష్ట్ర స్థాపన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. అదే పార్టీ తర్వాత బీఆర్ఎస్గా మారింది. జాతీయ స్థాయిలో తెలంగాణ అంశం ప్రాధాన్యం తగ్గిన సమయంలో కేసీఆర్ ఆందోళనలు, చర్చలు, ప్రజా చైతన్య కార్యక్రమాల ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. 2009లో చేపట్టిన నిరాహార దీక్ష ఉద్యమానికి కీలక మలుపు తీసుకొచ్చింది. దాని తర్వాత కేంద్రం రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభించింది. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ రోజు కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014 నుంచి 2023 వరకు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన సాగునీరు, సంక్షేమం, మౌలిక వసతులపై దృష్టి పెట్టారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలు చేపట్టి తాగు, సాగు నీటి సమస్యలు తగ్గించేందుకు అమలు చేశారు. రైతు బంధు వంటి పథకాలు ప్రభుత్వ విధానాల్లో ప్రధాన భాగమయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు...
కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ ఐటీ, ఔషధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది. పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్రం ఎదిగిందని అనుచరులు చెబుతున్నారు. ప్రాజెక్టుల అమలు, ఆర్థిక వ్యవహారాలపై విమర్శలు వచ్చినా తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర కీలకమనే అభిప్రాయం ఉంది. జన్మదిన సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో భారీ వేడుకలు నిర్వహించనున్నారు. పార్టీ కార్యాలయాన్ని జెండాలు, బ్యానర్లతో అలంకరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొనే కేక్ కటింగ్‌లో 72 కిలోల కేక్‌ను సిద్ధం చేశారు. కేసీఆర్ జీవిత ప్రస్థానంపై రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, పండ్లు, స్వీట్లు పంపిణీ, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విదేశాల్లో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం కూడా కార్యక్రమాలు చేపడుతోంది.
Next Story

