Mon Feb 23 2026 20:30:02 GMT+0530 (India Standard Time)
Kavitha : కవిత అసలు లక్ష్యం అదేనా? అసలు ఏం జరుగుతుంది?
తెలంగాణలో కవిత తన సొంత పార్టీని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.

తెలంగాణలో కవిత తన సొంత పార్టీని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ పేరు కూడా ఖరారయినట్లు తెలిసింది. తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరుతో పార్టీని ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిసింది. తాను తొలి నుంచి తెలంగాణ జాగృతి సంస్థ పేరిట ప్రజల్లోకి వెళ్లడంతో అదే పేరును కలిసి వచ్చేలా ఈ పేరును ఖరారు చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణ జాగృతి పేరు ఇప్పటికే ప్రజల్లో బాగా నాని ఉండటంతో ఆ పేరు కలసి వచ్చేలా ఈ పేరును ఎంపిక చేసినట్లు తెలిసింది. వచ్చే నెలలో పార్టీ ప్రకటన ఉంటుందని తెలంగాణ జాగృతి సంస్థ ప్రతినిధులు కొందరు తెలిపారు. మార్చి నెలలోనే పార్టీ పేరు, జెండాను కవిత ప్రజల ముందు ఆవిష్కరిస్తారని తెలిపారు.
జూన్ నెలలో భారీ బహిరంగ సభతో...
జూన్ నెలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ తర్వాత జనంలోకి వెళ్లాలన్నది కవిత నిర్ణయంగా తెలుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరును ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని, రెండు ప్రభుత్వాల్లో జరిగిన, జరుగుతున్న అవినీతి అక్రమాలను కూడా కవిత బయటపెడతారని అంటున్నారు. ఇప్పటికే కవిత వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే స్థానాలను కూడా ప్రకటించారు. సిద్ధిపేట, బోధన్ ల నుంచి పోటీ చేస్తానని కవిత చెప్పడంతో ఆమె లక్ష్యం హరీశ్ రావు అన్నది స్పష్టంగా తెలుస్తోంది. కవిత తొలి నుంచి హరీశ్ రావు, సంతోష్ రావులపైనే విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు సిద్ధిపేటలో పోటీ చేసి హరీశ్ రావును దెబ్బకొట్టాలన్న ఆలోచనతో ఉన్నారు.
కవిత వల్ల ....
బోధన్ తన అత్తగారి జిల్లాకు చెందిన ప్రాంతం కావడంతో అక్కడ తనకు పట్టు ఉంటుందని భావించి పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే కవిత కారణంగా ఏ పార్టీకి నష్టం జరుగుతుందన్న దానిపై ఇప్పటికే రాజకీయ పార్టీలు ఒక అంచనాకు వచ్చాయి. కవిత ఆరోపణలు కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై చేసినా ఆ ప్రభావం కారు పార్టీపైనే ఎక్కువగా పడే అవకాశముందని అంటున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పెద్దగా కవిత వల్ల డ్యామేజీ అయితే జరగలేదని పైకి కొంత బింకంగా కనిపిస్తున్నా ఎంతో కొంత నష్టం తమకే జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు లోలోపల భయపడుతున్నారు. కవిత నుంచి ఎదురయ్యే నష్టాన్ని కంట్రోల్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి బీఆర్ఎస్ నాయకత్వం కూడా ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తం మీద కవిత ఎఫెక్ట్ ఏ మేరకు ఎంత పడుతుందన్నది తెలియక గులాబీ పార్టీ నేతల్లో గుబులు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.
Next Story

