Wed Jan 07 2026 05:00:46 GMT+0000 (Coordinated Universal Time)
కవిత పార్టీ తో ఏ మేరకు .. ఎంత నష్టం.. అంచనాలు ఇవేనా?
బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కళ్ల ముందే విచ్ఛిన్నమవుతుంది.

బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కళ్ల ముందే విచ్ఛిన్నమవుతుంది. ఆయన కూడా చూసీ చూడనట్లు ఊరుకున్నందునే ఇంతటి అనర్థమని చెప్పకతప్పదు. తండ్రిగా, పార్టీ అధినేతగా కేసీఆర్ నేతలను సముదాయించాల్సిన కేసీఆర్ ఫాం హౌస్ లో మఠం వేసుకుని కూర్చుండటంతోనే పరిస్థితి ఇంత వరకూ వచ్చింది. తన కుమార్తె కల్వకుంట్ల కవిత అసంతృప్తితో ఉందని కేసీఆర్ కు తెలుసు. కానీ ఆయన పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అదే సమయంలో కవిత రాసిన లేఖ కూడా బహిర్గతం కావడంతో ఆమె ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. అప్పటికైనా తన కుమార్తె కల్వకుంట్ల కవితను తన వద్దకు పిలుచుకుని జరుగుతున్న విషయాలను వివరించి ఆమెకు సర్ది చెబితే పరిస్థితి చేయదాటి పోయేది కాదు.
ఆదిలోనే తుంచి ఉంటే...
కానీ కేసీఆర్ మౌనమే ఇన్ని అనర్థాలకు మూలకారణమని చెప్పకతప్పదు. తన కుమార్తెను చూసీ చూడనట్లు పట్టించుకోకపోవడం, పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆమె వీధుల్లోకి వచ్చి పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. పార్టీ నేతలపై విమర్శలు చేసినా అది కేసీఆర్ పై చేసినట్లే. ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రజలు ఖచ్చితంగా భావిస్తారు. అల్లుడి హరీశ్ రావుతో పాటు తన మరో బంధువు సంతోష్ రావును సంతోష పెట్టాలనుకున్నారే కానీ కుమార్తెను ఓదార్చాలన్న భావన గులాబీ బాస్ లో కలగలేదు. దీంతో కవిత ఇప్పుడు అన్ని రకాలుగా పార్టీని డ్యామేజీ చేస్తున్నారు. ప్రత్యర్థులు చేసే విమర్శలు వేరు కల్వకుంట్ల కుటుంబంలో ఒక సభ్యురాలు చేసే విమర్శలకు చాలా తేడా ఉంటుంది.
మౌనమే కారణం...
ఎంత మర్చిపోవాలన్నా కల్వకుంట్ల కవిత ఊరుకునేటట్లు కనిపించడం లేదు. ఆమెతెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందని ప్రకటించారు. తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ శూన్యత ఉందని, త్వరలోనే మరొక కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు కానుందని కల్వకుంట్ల కవిత తెలిపారు.యువత కోసం కొత్త రాజకీయ వేదిక రాబోతుందని కల్వకుంట్ల కవిత చెప్పారు. తెలంగాణలోని బలహీన, బడుగు, మైనారిటీ వర్గాల కోసం ఈ రాజకీయ వేదికను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఉద్యమకారులతో పాటు అమరవీరుల కుటుంబాలు కూడా ముందుకు రావాలని కల్వకుంట్ల కవిత పిలుపు నిచ్చారు. కవిత వల్ల ఎవరికి లాభం అని చర్చించేకంటే కవిత పార్టీ పెట్టడం వల్ల కారు పార్టీకి చాలా వరకూ రాజకీయంగా నష్టంజరుగుతందన్నది మాత్రం వాస్తవం. ఇదంతా కేసీఆర్ మౌనమే కారణమని చెప్పకతప్పదు. ఆయన జోక్యం చేసుకోకపోవడంతో కాంగ్రెస్ కు లాభం చేకూర్చే విధంగా తయారయిందని చెప్పక తప్పదు.
Next Story

