Mon Jan 05 2026 13:56:49 GMT+0000 (Coordinated Universal Time)
BRS : టార్గెట్ హరీశ్... కానీ బద్నాం అయ్యేది మాత్రం బీఆర్ఎస్.. ఇదేంది కవితక్కా
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ కు పెద్ద అడ్డుగా మారారు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ కు పెద్ద అడ్డుగా మారారు. కల్వకుంట్ల కవిత కారు స్పీడుకు బ్రేకులు వేస్తున్నట్లే కనిపిస్తుంది. ఒకరకంగా రాజకీయంగా కాంగ్రెస్ ను అణగదొక్కి తాము పైకి రావాలని భావిస్తున్న గులాబీ పార్టీకి ముల్లులాగా కల్వకుంట్ల కవిత తయారైందని చెప్పాలి. ఆమె ఆగ్రహం హరీశ్ రావు పైన. ఆమె కోపం సంతోష్ రావు పైన. ఆమె అసంతృప్తి కేటీఆర్ పైన. కానీ ప్రతి రోజూ కల్వకుంట్ల కవిత చేసే వ్యాఖ్యలు ఆ పార్టీని రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నాయి. సొంత పార్టీలోనే కవిత వ్యాఖ్యలను సమర్ధించే వారు అనేక మంది ఉన్నారు. తాజాగా హరీశ్ రావు పై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు మరోసారి గులాబీ పార్టీలో కలకలం రేపుతున్నాయనే చెప్పాలి.
హరీశ్ రావు వల్లనే...
ఒకవైపు కృష్ణా నది జలాల అంశంపైన, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపైన ప్రభుత్వ విమర్శలను తిప్పి కొట్టాలని బీఆర్ఎస్ భావిస్తుంటే దానికి కల్వకుంట్ల కవిత గండి కొడుతున్నట్లే కనపడుతుంది. హరీశ్ రావును ఒక మాట అంటే అసెంబ్లీ ని బాయ్ కాట్ చేశాడన్నారు. మరి కేసీఆర్ ని ఎన్నో మాటలు అన్నప్పుడు ఎందుకు చేయలేదని కవిత ప్రశ్నించారు. గుంట నక్క హరీశ్‌రావు ధనదాహం తీర్చుకోవడం కోసం పాలమూరు ప్రజల నోట్లో మట్టి కొట్టాడంటూ కల్వకుంట్ల కవిత ఆరోపించార. జూరాల నుంచి నిర్మించాల్సిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును శ్రీశైలానికి మార్చింది హరీశ్ రావే నని అన్నారు. కేవలం కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు దండుకోవడానికే ఈ మార్పు చేశాడంటూ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ విమర్శలకు ఊతమిస్తూ...
సొంత రాష్ట్రం వస్తే నీళ్లు వస్తాయని, వలసలు ఆగిపోతాయని, తమ బతుకులు బాగుపడతాయని అనుకున్న పాలమూరు ప్రజలు గుంట నక్క హరీశ్ రావు చేతుల్లో బలైపోయారంటూ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. హరీశ్ రావు ధనదాహానికి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ప్రజలు బలైపోయారంటూ కల్వకుంట్ల కవిత అనడంతో ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు ఊతమిచ్చినట్లయింది. అయితే కల్వకుంట్ల కవిత కు కౌంటర్ ఇచ్చే వారు ఇప్పుడు బీఆర్ఎస్ లో కనిపించడం లేదు. అలాగే హరీశ్ రావు కూడా తనపై కవిత చేస్తున్న ఆరోపణలకు కూడా సమాధానం ఇవ్వలేదు. కల్వకుంట్ల కవిత ను కంట్రోల్ కేసీఆర్ పెట్టకుంటే పార్టీ మరింత డ్యామేజ్ అవుతుందని గులాబీ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం కల్వకుంట్ల కవిత కారు స్పీడ్ కు బ్రేకులు వేస్తున్నారన్నది సుస్షష్టంగా తెలుస్తోంది.
Next Story

