Fri Dec 05 2025 12:27:04 GMT+0000 (Coordinated Universal Time)
Kalavakuntla Kavitha : నేడు కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్ష ప్రారంభం
బీసీలకు రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాలంటూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత నేటి నుంచి నిరాహార దీక్ష ప్రారంభించనున్నారు

బీసీలకు రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాలంటూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత నేటి నుంచి నిరాహార దీక్ష ప్రారంభించనున్నారు. ఈ మేరకు పోలీసుల నుంచి అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు. ఈరోజు నుంచి 5,6 తేదీల్లో నిరాహార దీక్ష చేస్తానని కవిత ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం తాను ఈ దీక్షను చేపడుతున్నానని కల్వకుంట్ల కవిత తెలిపారు. కవిత నిరాహార దీక్ష ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్ వద్ద ఈ నిరాహార దీక్షను చేయడానికి కవిత అంతా సిద్ధం చేసుకున్నారు.
పోలీసుల అనుమతితో...
కల్వకుంట్ల కవితతో పాటు తెలంగాణ జాగృతికి చెందిన కొందరు నేతలు కూడా ఈ దీక్షకు దిగే అవకాశముంది. వారు మాత్రం రిలే నిరాహార దీక్షలు చేస్తారని, కవిత మాత్రం 72 గంటల పాటు దీక్ష చేస్తారని అంటున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా అంబేద్కర్ విగ్రహ సాధన కోసం తాను దీక్ష చేశానని కల్వకుంట్ల కవిత చెబుతున్నారు. అయితే ఈ నిరాహారదీక్ష తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనే జరుగుతుండటంతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మాత్రం ఈ దీక్షకు దూరంగా ఉండనున్నారు.
వేగంగా అడుగులు....
కల్వకుంట్ల కవిత దీక్షకు భారీగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు హాజరయ్యే అవకాశముంది. అందుకే ఇందిరాపార్కు వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే తెలంగాణ జాగృతి కార్యాలయంలోనే 72 గంటల పాటు కవిత దీక్షకు దిగే అవకాశముందని కూడా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. బీఆర్ఎస్ కంటే వేగంగా తాను అడుగులు వేస్తూ ప్రతి విషయంలో ముందుండేందుకు కల్వకుంట్ల కవిత ప్రయత్నిస్తున్నారు. కల్వకుంట్ల కవిత దీక్షకు పెద్దగా ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ లో ఎంత కలహాలు పీక్స్ కు చేరుకుంటే అది తమకు మంచిదని కాంగ్రెస్ ప్రభుత్వం సహజంగానే భావిస్తుంది కనుక.
News Summary - kalvakuntla kavitha will begin a hunger strike from today under the auspices of telangana jagruti demanding the approval of the reservation bill for BCs
Next Story

