Fri Dec 05 2025 18:40:00 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : కవిత బీఆర్ఎస్ కు భారమవుతున్నారా? ఏం చెప్పదలచుకున్నారు?
కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ లో సీనియర్ నేత. కవిత చేసిన కామెంట్స్ పార్టీకి తలనొప్పిగా మారాయి

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ లో సీనియర్ నేత. ఆమెకు అన్యాపదేశంగా ఏ కామెంట్ కూడా చేస్తుందని అనుకోలేం. ఎందుకంటే కేసీఆర్, కేటీఆర్ తరహాలోనే కవిత కూడా మాటల పుట్ట. రాజకీయాలతో పాటు మాటలను, పదజాలాన్ని తెలంగాణ సామాన్య జనాలకు అర్థమయ్యేలా మాట్లాడటంతో తండ్రి నుంచివారసత్వం అందుకున్న కవిత ఏ మాట మాట్లాడినా దానికి విలువ ఉంటుంది. ఏదో పరమార్థం ఉంటుంది. ఆమె అనాలోచితంగానో లేక అవగాహన లేకనో అంటారని ఎవరూ అనుకోరు. ఏదో ఆశించి ప్రతి మాట మాట్లాడతారు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో అరెస్టయి జైలులో ఉండి వచ్చిన తర్వాత కవిత వైఖరిలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. కేసీఆర్ కుమార్తెగా తిరిగి ఆమె రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ ఆమె మాట్లాడుతున్న మాటలు పార్టీకి డ్యామేజీ కలిగించేలా ఉన్నాయి.
కాకరేపుతున్న కవిత కామెంట్స్...
కల్వకుంట్ల కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలు పార్టీలో కాక రేపుతున్నాయి. నేరుగా గులాబీ బాస్ కేసీఆర్ కు సూటిగా తగిలేలా ఉన్నాయి. ఇటీవల కల్వకుంట్ల మాట్లాడుతూ భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నప్పటికీ సకలజనులకు, సబ్బండ వర్గాలకు న్యాయం చేసే తెలంగాణను సాధించుకోలేకపోయామని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా నియంత పాలనను చూస్తున్నామన్నారు. నియంత పాలనపై పోరాడినట్లే రేపటి తెలంగాణలోనూ సమసమాజ స్థాపన కోసం మరో ఉద్యమం రావాలని కవిత అన్నారు. అంతటితో ఆగకుండా సామాజిక తెలంగాణ దిశగా భవిష్యత్ అడుగులు పడాలని కవిత అన్నారు. దీంతో కవిత చేసిన వ్యాఖ్యలు రివర్స్ లో కారు పార్టీకే తగిలినట్లు సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది.
పదేళ్లు కేసీఆర్ సీఎంగా...
2014లో తెలంగాణ వచ్చిన నాటి నుంచి 2023 వరకూ బీఆర్ఎస్ అధికారంలో ఉంది. కల్వకుంట్ల కవిత తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణను ఏలారు. అయితే సామాజిక తెలంగాణ రాలేదని చెప్పి కేసీఆర్ తో పాటు పార్టీ నేతలను కూడా డిఫెన్స్ లోకి కవిత నెట్టేశారంటున్నారు. పదేళ్ల పాటు సామాజిక తెలంగాణను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పక్కనపెట్టినట్లేనా? అని పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. పదేళ్లు అయ్య చేయలేని దానిపై పోరాటం చేయడం దేనికంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. అయితే కల్వకుంట్ల కవిత ఏ ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేశారో కానీ బీఆర్ఎస్ నేతలకు మాత్రం కొంత ఇబ్బందిగా తయారయ్యాయని చెప్పాలి. మరి దీనిపై కవిత మాత్రమే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Next Story

