కాకతీయుల కాలపు శిధిల శివాలయం కాపాడాలి
700 ఏళ్ల నాటి శిల్పాలను సంరక్షించాలి అన్న శివనాగిరెడ్డి బొత్తలపాలెం వద్ద నందిబోడుపై పురాతన శివాలయ అవశేషాల పరిశీలన

దామరచర్ల, మార్చి 14: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం బొత్తలపాలెం శివారులోని నందిబోడుపై ఉన్న కాకతీయుల కాలం (సా.శ. 13వ శతాబ్దం) నాటి శిధిల శివాలయం, అక్కడ ఉన్న శివలింగం, నంది, చెన్నకేశవ శిల్పాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు.
గ్రామానికి చెందిన ఇంజం నర్సిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు శనివారం ఆయన నందిబోడుపై ఉన్న శిల్పాలను గ్రామస్తుల సమక్షంలో పరిశీలించారు. ఆలయంలో చెట్లు, పుట్టలు పెరిగి గోడలు కూలిపోయాయని చెప్పారు. ఆలయం వెనక నిర్మించిన తాత్కాలిక రేకు షెడ్డు కింద కాకతీయుల శైలి స్పష్టంగా కనిపించే శివలింగం పానపట్టం, ముట్టె, చెవులు దెబ్బతిన్న నంది విగ్రహం ఉన్నాయని తెలిపారు.
అలాగే తల, కాళ్లు లేకపోయినా అందంగా చెక్కిన శ్రీదేవి, భూదేవి సహిత చెన్నకేశవ విగ్రహాలు అక్కడ ఉన్నాయని చెప్పారు. ఇవి సుమారు 700 సంవత్సరాల నాటి బొత్తలపాలెం గ్రామ చరిత్రకు ఆనవాళ్లని, వాటిని సంరక్షించి భవిష్యత్తు తరాలకు అందించాలని గ్రామస్తులను కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇంజం నర్సిరెడ్డి, ఉపసర్పంచ్ నర్సింగ్ అనిల్, గ్రామ పెద్దలు పగిడిపాటి శ్రీనివాస్ రెడ్డి, వీరారెడ్డి, రవీందర్ రెడ్డి, కందుల బిక్షారెడ్డి, పలసాని రామ్ రెడ్డి, పోటుపల్లి బాబు, ఉదయ్, సిరసాల సైదులు, నామా రవీందర్, ఆకారపు గోపాల్, మునగాల వెంకటరెడ్డి పాల్గొన్నారు. శిల్పి బి. వెంకటరెడ్డి, పింగళి వెంకట నాగప్రసాద్ కూడా హాజరయ్యారని శివనాగిరెడ్డి తెలిపారు.

