Thu Dec 25 2025 14:17:03 GMT+0000 (Coordinated Universal Time)
Kadiyam Srihari : కడియం శ్రీహరిని తెలివిగా తప్పించేశారా?
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని అనర్హత వేటు నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని అనర్హత వేటు నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కడియం శ్రీహరి 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి స్టేషన్ ఘన్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆయన తర్వాత తన కుమార్తె కావ్యతో కలసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయాన్ని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అప్పటి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారంటూ అప్పటి ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో పాటు కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఫొటోలను కూడా వైరల్ చేస్తున్నారు.
ఆ ఇద్దరిపైన తొలి నుంచి...
బీఆర్ఎస్ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటీషన్లను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ గడ్డం ప్రసాదరావు విచారణ ప్రారంభించారు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే తొలి నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై అనర్హత వేటు పడుతుందని భావించారు. దానం నాగేందర్ నేరుగా 2024 లో జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా, కడియం శ్రీహరి కుమార్తె కావ్య వరంగల్ ఎంపీ పదవికి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కడియం శ్రీహరి తన కుమార్తె గెలుపు కోసం పనిచేశారంటున్నారు.
ఆధారాలున్నాయంటూ...
అంటే ఈ ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయన్నది బీఆర్ఎస్ నేతల వాదన. కానీ కాంగ్రెస నాయకత్వం మాత్రం కేవలం ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్ ఒక్కరి విషయంలోనే నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో గెలుపుతో సిటీలో మరొక ఉప ఎన్నికలోనైనా సులువుగా గెలవాలని భావించి ఉండవచ్చు. అదే గ్రామీణ ప్రాంతమైన స్టేషన్ ఘన్ పూర్ లో ఉప ఎన్నికలు జరిపి చేయి కాల్చుకునే పరిస్థితుల్లో కాంగ్రెస నాయకత్వం లేదన్నది అర్థమవుతుంది. అందుకే తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు కడియం శ్రీహరి స్పీకర్ కు ఇటీవల వివరణ ఇచ్చారంటున్నారు. మొత్తం మీద ఉప ఎన్నికల బరి నుంచి కాంగ్రెస్ నాయకత్వం తెలివిగా తప్పించిందన్న విమర్శలను బీఆర్ఎస్ పార్టీ ఘాటుగా చేస్తుంది. మరి స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.
Next Story

