Fri Dec 05 2025 08:15:00 GMT+0000 (Coordinated Universal Time)
Jublee Hills By Elections : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పతంగ్ పార్టీ ప్లాన్ ఏంటో తెలుసా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. అయితే హైదరాబాద్ లో పట్టున్న ఎంఐఎం పార్టీ మాత్రం ఇంత వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అసలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తుందా? లేదా? అన్నది కూడా అనుమానంగానే ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంఐఎం కీలక భూమిక పోషించనుంది. నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. గతంలోనూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసింది. మిగిలిన పార్టీల కంటే అత్యధిక ఓట్లను ఎంఐఎం అభ్యర్థి సాధించింది. గతంలోనూ ఎంఐఎం తరుపున నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అత్యధిక ఓట్లను సాధించారు.
బస్తీల్లో పట్టున్న...
గెలవకపోయినా అత్యధిక ఓట్లను సాధించారు. గత ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఆయన మాగంటి గోపీనాధ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి మాత్రం అజారుద్దీన్ పేరు కాంగ్రెస్ పార్టీలో వినిపించడం లేదు. కేవలం మూడు పేర్లను మాత్రమే అధినాయకత్వానికి పంపింది. అందులో నవీన్ యాదవ్ పేరు మొదట ఉంది. గతంలో నవీన్ యాదవ్ ఎంఐఎం పార్టీలో ఉన్నారు. శ్రీశైలం యాదవ్ కుమారుడైన నవీన్ యాదవ్ కు జూబ్లీహిల్స్ బస్తీలో మంచి పట్టు ఉండటం కూడా కలసి వస్తుందని భావిస్తుంది. అయితే ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ఎంఐఎం తన పార్టీ అభ్యర్థిని నిలబెడుతుందా? లేక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు పలుకుతుందా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో...
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం మిత్రుడిగా వ్యవహరిస్తుంది. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినప్పటి నాటి నుంచి ఎంఐఎం వైఖరి మారింది. అప్పటి వరకూ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు మద్దతుగా ఉన్న ఎంఐఎం తర్వాత కాంగ్రెస్ కు అనధికార మిత్రపక్షంగా తయారైంది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించే అవకాశాలను కొట్టిపారేయలేం. తాము పోటీలో నిలబడితే అది బీజేపీకి ప్లస్ గా మారుతుందని కూడా ఎంఐఎం భయపడే అవకాశముంది. అందుకే ఈ ఎన్నికలకు ఎంఐఎం దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరోక్షంగానో.. ప్రత్యక్షంగానో కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మద్దతు పలికే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.
Next Story

