Sat Dec 13 2025 22:31:08 GMT+0000 (Coordinated Universal Time)
Jubilee Hills Bye Elections : ముగ్గురికీ ఇది సవాల్.. కింగ్ ఎవరనేది?
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక మూడు పార్టీలకు చెందిన ముగ్గురు ముఖ్య నేతలకు సవాల్ గా మారింది.

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక మూడు పార్టీలకు చెందిన ముగ్గురు ముఖ్య నేతలకు సవాల్ గా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు ఈ ఎన్నిక ఫలితాలు ఖచ్చితంగా వారి నాయకత్వంపై ప్రభావం చూపుతుంది. అందుకోసం ఈ ఎన్నిక కోసం కాళ్లకు బలపం కట్టుకుని మరీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఈ ఎన్నికల్లో వ్యక్తిగత విమర్శలతో పాటు పార్టీలు, ప్రభుత్వ పనితీరుపై కూడా పెద్దయెత్తున ఆరోపణలు చేస్తుండటంతో ఎన్నికకు సంబంధించి హీట్ పెరుగుతుంది. ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇక అన్ని పార్టీలూ ప్రచారాన్ని ఉధృతం చేశారు.
ముఖ్యమంత్రి పాలనపై...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై రెఫరెండంగా భావించాలని బీఆర్ఎస్ గట్టిగా ఎన్నికల ప్రచారంలో చెబుతుంది. గత రెండేళ్ల నుంచి ఆయన పనితీరుకు ఈ ఎన్నికలకు అద్దం పడతాయని అంటున్నారు. అలాగే ఇప్పటికే కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిచిన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలోనూ గెలుపు తమదేనని పైకి ధీమాగా కనిపిస్తున్నప్పటికీ ప్రజా తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై మాత్రం ఒకింత ఆందోళన మాత్రం కనిపిస్తుంది. రెండేళ్ల లో గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, అనేక హామీలను తుంగలోకి తొక్కారని, కేసీఆర్ హయాంలో జరిగిన హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు ఎక్కడికైనా సిద్ధమని బీఆర్ఎస్ సవాల్ విసురుతుంది. ఈ ఎన్నికల ఫలితంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యలు కూడా సమసిపోతాయని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఓడిపోతే మాత్రం అసంతృప్తి నేతలు మరొకసారి చెలరేగిపోయే అవకాశముందన్న భయం పాలకుల్లో కనిపిస్తుంది.
కేటీఆర్ నాయకత్వానికి...
అదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలను చేపట్టిన తర్వాత జరుగుతున్న ఎన్నిక కావడంతో ఆయన నాయకత్వం, పనితీరుపై కూడా ఈ ఎన్నిక ఫలితాలు ప్రభావం చూపుతాయని అంటున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ బయటకు రాకపోవడంతో కేటీఆర్ ఒక్కరే ఈ ఉప ఎన్నిక ప్రచారాన్ని త భుజస్కంధాలపై వేసుకుని ముందుకు సాగుతున్నారు. అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా కేటీఆర్ మాట చెల్లుబాటు అయింది. ఈ ఎన్నికలలో గెలిస్తేనే రాష్ట్ంరలోని అన్ని నియోజకవర్గాల్లో నాయకులు యాక్టివ్ అవుతారని భావిస్తున్నారు. అదే ఓటమి పాలయితే మాత్రం ఈ ఎన్నిక తర్వాత పార్టీ క్యాడర్ మరింత నిరాశలోకి వెళ్లే అవకాశముంది. అందుకే కేటీఆర్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా...
బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక ఛాలెంజ్ అని చెప్పాలి. ఆయన అభ్యర్థి విషయంలో తన మాటే చెల్లుబాటు చేసుకున్నారు. దీంతో అభ్యర్థి దీపక్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిపై పడింది. దీంతో కేంద్రమంత్రిగా ఉండి గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. రాజాసింగ్ వంటి నాయకులు ఇప్పటికే ఈ ఎన్నికలపై విమర్శలు చేశారు. అభ్యర్థి ఎంపికతో పాటు తనను గెలిపించుకునే బాధ్యత కూడా కిషన్ రెడ్డి ఒక సవాల్ గా తీసుకుని ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటి గడపకు వెళ్లేలా బీజేపీ శ్రేణులను సమాయత్తం చేశారు. ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉందని చెప్పి వేగంగా పార్టీని తీసుకెళుతున్నారు. దీంతో ఈ ఉప ఎన్నిక ముగ్గురిలో ఎవరికి పార్టీ నాయకత్వం పరంగా క్రేజ్ ను పెంచుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story

