Sat Dec 13 2025 22:31:40 GMT+0000 (Coordinated Universal Time)
Jublee Hills Bye Poll : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదంటే?
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఈ నెల 14వ తేదీన కౌంటింగ్ జరగనుంది

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఈ నెల 14వ తేదీన కౌంటింగ్ జరగనుంది. అయితే ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ లో సర్వేలన్నీ కాంగ్రెస్ కే అనుకూలంగా వచ్చాయి. అతి తక్కువ శాతం పోలింగ్ నమోదయింది. పోల్ మేనేజ్ మెంట్ లో బీఆర్ఎస్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో కాంగ్రెస్ కు ఈ ఎన్నికలలో ఎడ్జ్ ఉన్నట్లు కనిపిస్తుందని దాదాపు అన్ని సర్వేలు తేల్చాయి. బీజేపీకి డిపాజిట్ రావడం కూడా కష్టమని సర్వేలు తేల్చాయి. రాత్రికి రాత్రి కాంగ్రెస్ ఫలితాలను తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు సర్వే సంస్థలు వెల్లడించాయి. మరో మూడేళ్ల కాలం కాంగ్రెస్ కు అధికారం ఉండటంతో ఓటర్లు ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపినట్లు ఈ సర్వేల్లో స్పష్టమయింది.
పోల్ మేనేజ్ మెంట్ లో...
మరొకవైపు బీఆర్ఎస్ ప్రచారం ఉధృతంగా చేసినప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం చేతులెత్తేసినట్లు కనిపిస్తుంది. ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ నేతల ఫ్రస్టేషన్ చూస్తుంటే వారికి పరిస్థితి అర్థమయిందని అంటున్నారు. అందుకే దొంగ ఓట్లు అంటూ విమర్శలు చేస్తున్నారంటున్నారు. మరొకవైపు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు కూడా బీఆర్ఎస్ కు లేకపోవడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. బీఆర్ఎస్ కు ఓటేస్తే ఏమి చేస్తామో చెప్పకుండా ప్రచారం మొత్తం ప్రభుత్వంపై విమర్శలు చేయడం కూడా ఆ పార్టీకి నష్టం చేకూర్చిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే దాదాపు అన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో ఎవరిది విజయమన్నది ముందుగానే తెలిసిపోయిందంటున్నారు. నాలుగు లక్షల ఓటర్లున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కేవలం 48 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. అంటే రెండున్నర లక్షల ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఎవరు గెలిచినా మెజారిటీ ఆరు నుంచి ఏడు వేలకు మించి రాదన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.
సర్వేలు ఇలా...
అపర చాణక్య సర్వే ప్రకారం కాంగ్రెస్ 47శాతం, బీఆర్ఎస్ 41శాతం, బీజేపీ 6 శాతం ఓట్లు వస్తాయని చెప్పింది. కౌటిల్య స్ట్రాటజీస్ కాంగ్రెస్ కు 48 శాతం, బీఆర్ఎస్ 42 శాతం, బీజేపీ 7 శాతం ఓట్లు వస్తాయని చెప్పింది.చాణక్య స్ట్రాటజీస్ కాంగ్రెస్ కు 46 శాతం, బీఆర్ఎస్ కు 41 శాతం, బీజేపీ ఆరు శాతం ఓట్లకే పరిమితమవుతాయని తెలిపింది. పీపుల్స్ పల్స్ కాంగ్రెస్ కు 48 శాతం, బీఆర్ఎస్ కు 41 శాతం, బీజేపీకి 6శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. స్మార్ట్ పోల్ కాంగ్రెస్ కు 51 శాతం, బీఆర్ఎస్ కు 39 శాతం, బీజేపీకి ఐదు శాతం ఓట్లు, నాగన్న సర్వే కాంగ్రెస్ కు 47 శాతం, బీఆర్ఎస్ కు 41శాతం, బీజేపీకి 8 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. ఒక్క కేకే సర్వే మాత్రం కాంగ్రెస్ కు 46 శాతం, బీఆర్ఎస్ కు 49 శాతం, బీజేపీకి రెండు శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. బీకే సర్వే కూడా బీఆర్ఎస్ కు యాభై, కాంగ్రెస్ కు 44, బీజేపీకి 4 శాతం ఓట్లు వస్తాయని చెప్పింది. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎగ్జాట్ పోల్స్ కావు. అలాగని కొట్టిపారేయలేం. మొత్తం మీద మూడు పార్టీలకు ఈ ఉప ఎన్నిక టెన్షన్ పెట్టిందనే చెప్పాలి.
Next Story

