Sat Dec 13 2025 22:33:05 GMT+0000 (Coordinated Universal Time)
BRS : కారును గ్యారేజీకి పంపాల్సిందే.. ఇంజిన్ ను మార్చాల్సిందేనా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ శ్రేణులను మరింత కుంగ దీశాయి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ శ్రేణులను మరింత కుంగ దీశాయి. సిట్టింగ్ స్థానాలను రెండింటిని గత రెండేళ్లలో కోల్పోవడం కూడా క్యాడర్ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసింది. ఈ ఓటములకు కారణం అభ్యర్థులు కాదు.. కేవలం పార్టీ నాయకత్వమేనని స్పష్టంగా చెప్పాలి. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఎమ్మెల్యేగా గెలిచిన నెలలు తిరగక ముందే ఆమె మరణించడంతో సాయన్న మరో కుమార్తె నివేదితను పోటీకి దింపారు. కానీ నాడు ఆ ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలో గెలవగా, మూడో స్థానానికి బీఆర్ఎస్ పరిమితమయింది. ఇప్పుడు కూడా అన్ని పార్టీల కంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభ్యర్థిని బీఆర్ఎస్ ప్రకటించింది.
ముందుగానే అభ్యర్థిగా ప్రకటించినా...
తమ పార్టీకి చెందిన మాగంటి గోపీనాధ్ సతీమణి మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించారు. అయినా రెండుసార్లు బీఆర్ఎస్ గెలుపు సాధించలేదు. అంటే ఇక్కడ అభ్యర్థుల కంటే నాయకత్వాన్ని మాత్రమే ప్రజలు చూశారని చెప్పాల్సి ఉంటుంది. గత రెండేళ్లుగా పార్టీ అధినేత కేసీఆర్ ప్రజా సమస్యలపై పెద్దగా బయటకు రావడం లేదు. అప్పుడప్పుడు బయటకు వచ్చి వెళ్లడం తప్ప ఆయన ఎక్కువగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఆరోగ్యం పరిస్థితులు కూడా ఆయనను బయటకు రానివ్వడం లేదు. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నీ తన భుజాల మీద వేసుకుని చేశారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నారు. అయితే ప్రచారంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప మరొకటి లేకుండాఉంది.
పోల్ మేనేజ్ మేంట్ లోనూ...
పోల్ మేనేజ్ మెంట్ లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా విఫలమయింది. కారుకు, బుల్ డోజర్ కు మధ్య పోటీ అంటూ పదే పదే ప్రచారం చేసినా ఆక్రమణల విషయంలో ప్రజలు బుల్ డోజర్ వైపు మొగ్గు చూపారనుకోవాలి. డబ్బులు తక్కువ ఖర్చు పెట్టలేదనుకోవడం పొరపాటే. కాంగ్రెస్ తో పోటీ పడిందనే చెప్పాలి. అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి రౌడీషీటర్ అని ప్రచారం ఒక పక్క చేస్తూ మరికొందరి రౌడీషీటర్లకు పార్టీ కండువాలు కప్పడం కూడా బీఆర్ఎస్ చేసిన తప్పిదాల్లో ఒకటి. ఇక సీమాంధ్ర ఓటర్లను ఆకట్టుకోవడంలో కూడా కేటీఆర్ విఫలమయ్యారు. టీడీపీ తటస్థంగా ఉండటం కూడా కాంగ్రెస్ కు లాభించింది. బీఆర్ఎస్ కు నష్టం చేకూర్చింది. ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో కేసీఆర్ వ్యవహరించిన తీరును, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని ప్రజలు బేరీజు వేసుకున్నట్లే ఉంది.
సీఎంల వ్యవహార శైలిపై...
నాడు కేసీఆర్ జనాలకు దగ్గరగా వచ్చే వారు కాదు. ఏ కార్యక్రమానికి హాజరయ్యే వారు కాదు. కానీ మొన్న తెలంగాణ కవి అందెశ్రీ మరణించినసమయంలో రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు కూడా అందరినీ కట్టిపడేసింది. ఇలా అనేక కారణాలు కారు కు హ్యాండ్ బ్రేక్ వేసినట్లయింది. మొత్తం మీద కేటీఆర్ చెప్పినట్లుగా తమను ప్రత్యామ్నాయంగా ప్రజలు చూస్తున్నారని చెప్పేకంటే ఎలా బలోపేతం కావాలో అవసరమైన చర్యలతో జనం ముందుకు వెళ్లాలి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలే తమను గెలిపిస్తాయని భావిస్తే మాత్రం జరిగే ఏ ఎన్నికల్లోనైనా కారు పార్టీకి భంగపాటు తప్పదన్నవిషయాన్ని గుర్తుంచుకోవాలి. వచ్చేస్థానిక సంస్థలఎన్నికల్లోనైనా,జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనైనా బీఆర్ఎస్ నాయకత్వం తమ పంథాను మార్చుకోకుండా వ్యవహరిస్తే మరోసారి ఓటమిని రుచిచూడక తప్పదని గుర్తుంచుకుంటే మంచిది.
Next Story

