Fri Dec 05 2025 07:12:10 GMT+0000 (Coordinated Universal Time)
Jubllee Hills By Elections : మాగంటి వారసులకు టిక్కెట్ అవకాశం లేదా? పోటీ కోసం ఆశావహులు పెరిగారా?
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ ఇటీవల మరణించారు. ఆయన అకాల మరణంతో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ ఇటీవల మరణించారు. ఆయన అకాల మరణంతో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. దీంతో తెలంగాణలో ఉప ఎన్నికల హీట్ మొదలయింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2014లో టీడీపీ నుంచి, 2018, 2023 నుంచి మాగంటి గోపీనాధ్ విజయం సాధించారు. ఆయన మూడు దఫాలుగా ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాన్ని ఆయన కుటుంబంలో టిక్కెట్ ఇచ్చే అవకాశం తక్కువగానే కనిపిస్తున్నాయి. అందుకే వేరే వారికి ఉప ఎన్నికలో సీటు ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. సహజంగా ఎమ్మెల్యే ఆకస్మికంగా మరణిస్తే కుటుంబ సభ్యులు పోటీ చేస్తే ఎన్నిక ఏకగ్రీవం కావడం మామూలుగా జరుగుతుంది.
వారు పోటీ చేయకుంటే...?
అయితే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మాగంటి కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేసే అవకాశం లేదంటున్నారు. వారు కూడా రాజకీయాల్లో మాగంటి వారసత్వాన్ని కొనసాగించేందుకు సుముఖంగా లేరని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వేరే వారికి టిక్కెట్ ఇస్తే మిగిలిన పార్టీలు కూడా పోటీకి దిగే అవకాశముంటుంది. అందుకే ఇప్పటి నుంచే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటి నుంచే అభ్యర్థులను సిద్ధం చేస్తున్నాయి. బీఆర్ఎస్ తమ అడ్డాగా భావించిన జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలలో గెలవాలని భావిస్తుంది. ఇందుకోసం పీజేఆర్ కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి పేరును పరిశీలిస్తుంది.
అవగాహన కుదిరితే...
ఇక కాంగ్రెస్ పార్టీలో గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అజారుద్దీన్ కూడా తనకు టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇప్పుడు ఎంఐఎంతో సఖ్యత ఉండటంతో ఈసారి గెలుపు తథ్యమని అజార్ భాయ్ భావిస్తున్నారు. ఇక శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. 2014 ఎన్నికల్లో నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ చేసి దాదాపు నలభై వేల కు పైగానే ఓట్లు సాధించారు. ఇక పీజేఆర్ కుమార్త్ విజయారెడ్డి కూడా తనకు అవకాశం కల్పించానలి కోరుతున్నారు. దీంతో కాంగ్రెస్, ఎంఐఎం లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుంటే గెలుపు తథ్యమని భావిస్తుండటంతో పోటీ ఎక్కువయిందంటున్నారు.
కూటమిగా పోటీ చేస్తే...
భారతీయ జనతా పార్టీకి హైదరాబాద్ నగరంలో మంచి పట్టుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు ముందే వస్తున్న ఈ ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలనుకుంటోంది. ఏపీలో టీడీపీ తో పొత్తులో ఉండటం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమకు కలసివస్తుందని కమలనాధులు అంచనా వేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిని నిలబెట్టగలిగితే విజయం తమదేనన్న ధీమాలో ఉన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దీపక్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నా మరొక కొత్త పేరు కమ్మ సామాజికవర్గానికి చెందిన ఒకపారిశ్రామిక వేత్త పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చంద్రబాబుతో భేటీ అయినప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కూడా చర్చించినట్లు తెలిసింది. మొత్తం మీద మూడు పార్టీ తమదైన వ్యూహాలతో ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నాయి.
Next Story

