Fri Dec 05 2025 16:07:34 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : జూబ్లీహిల్స్ లో బీజేపీ ఎవరిని దెబ్బేస్తుంది? అదే జరిగితే?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హోరా హోరీ సమరం జరగనుంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హోరా హోరీ సమరం జరగనుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ శ్రమిస్తుంది. అయితే నగరంలో మరొక స్థానాన్ని సంపాదించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. బీజేపీ కూడా తమ సత్తా చూపాలని రెడీ అవుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొని ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాధ్ సతీమణి మాగంటి సునీతకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ను ఎంపిక చేసింది. బీజేపీ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. నేడో, రేపో బీజేపీ అభ్యర్థి ఖరారు కానున్నారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ ఎవరికి దెబ్బేస్తుందన్న చర్చ రాజకీయాల్లో జోరుగా నడుస్తుంది.
సానుభూతి.. సేవలతో...
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తగిన బలం లేకపోయినా బీజేపీ మాత్రం ఒకరిని ఓడించే సత్తా ఉందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అయితే ఎవరికి బీజేపీ దెబ్బ పడుతుందన్నది రెండు ప్రధాన పార్టీలో చర్చగా మారింది. వాస్తవానికి బీఆర్ఎస్ సానుభూతిపై ఎక్కువ ఆధారపడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మరణించడంతో అనేక పేర్లు పార్టీలో వినిపించినా చివరకు ఆయన సతీమణి సునీత పేరును ఖరారు చేయడానికి సానుభూతి పవనాలు వీస్తాయన్న అంచనాలతోనేనని అంటున్నారు. అయితే మిగిలిన పార్టీల నేతలు మాత్రం సానుభూతి అన్ని సార్లు పనిచేయవన్న విషయాన్ని బీఆర్ఎస్ నేతలకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. గతంలో పాలేరులోనూ, దుబ్బాకలోనూ మరణించిన శాసనసభ్యుల కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇచ్చినా ఫలితం ఎలా వచ్చిందో చూశారా? అని ప్రశ్నిస్తున్నారు.
బీజీపీ బలం పెరగడంతో...
ఇదే సమయంలో బీజేపీ నగరంలో బలం పెంచుకుంది. అందులోనూ మోడీ ప్రభావం ఖచ్చితంగా చూపుతుంది. గతంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ అత్యధిక వార్డులను గెలుచుకుంది. దీంతో ఈ నియోజకవర్గంలో తమదే గెలుపు అని నమ్ముతున్నారు. కాంగ్రెస్ అయితే అక్కడ సేవా కార్యక్రమాలను నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తారని నమ్మకంగా ఉంది. ఆ కుటుంబానికి బస్తీల్లో మంచి పట్టు ఉండటమే ఇందుకు కారణం. కానీ బీజేపీ చీల్చే ఓట్లు బీఆర్ఎస్ వా? లేక కాంగ్రెస్ పార్టీవా? అన్నది మాత్రం అభ్యర్థి ఎంపిక తర్వాత మాత్రమే తేలుతుందంటున్నారు. మొత్తం మీద బజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో త్రిముఖ పోటీ మాత్రం రసవత్తరంగా మారిందనే చెప్పాలి.
Next Story

