Tue Mar 24 2026 19:43:00 GMT+0530 (India Standard Time)
Jeevan Reddy : జీవన్ రెడ్డి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా? ఫ్యూచర్ ప్లాన్ అదేనట
కాంగ్రెస్ తో సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రయాణానికి నేటితో ముగిసింది

కాంగ్రెస్ తో సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రయాణానికి నేటితో ముగిసింది. దాదాపు నాలుగు దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ లో ఉంటూ వివిధ పదవులను అధిష్టించిన జీవన్ రెడ్డి రేపు తన అనుచరులతో సమావేశమై తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఎంత మంది బుజ్జగించినా, చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వచ్చి నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా జీవన్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆయన బీఆర్ఎస్ లోనే చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జగిత్యాల రాజకీయాల్లో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన జీవన్ రెడ్డి, చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో తనకు ఎదురవుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఇన్నాళ్లు పట్టించుకోని నేతలు...
గత కొన్నాళ్లుగా పట్టించుకోని నేతలు ఆయన పార్టీ మారుతున్నారని ప్రకటించిన తర్వాత వచ్చి నచ్చ చెప్పే ప్రయత్నాలు చేయడం మాత్రం విడ్డూరమే అనుకోవాలి. ముఖ్యంగా తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి సంజయ్ కుమార్‌ను పార్టీలోకి చేర్చుకోవడం, ఆయనకే ప్రాధాన్యత ఇవ్వడంపై రగిలిపోతున్న జీవన్ రెడ్డి పార్టీ మారిపోవాలని డిసైడయ్యారు. అయితే ఏదో పార్టీ మారిపోయి కండువా కప్పుకుంటే ఎఫెక్ట్ రాదని..కొత్తగా ప్రయత్నిస్తున్నారు. తనకు కాంగ్రెస్ పార్టీలో జరిగిన అన్యాయాన్ని నియోజకవర్గంలో చెప్పేందుకు కూడా జీవన్ రెడ్డి సిద్ధమయ్యారు.
నియోజకవర్గంలో యాత్ర...
ఇందుకోసం జీవన్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. తనకు కాంగ్రెస్‌లో అన్యాయం జరిగిందనే సెంటిమెంట్‌తో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తారన్న ప్రచారం మాత్రం జోరుగా జరుగుతుంది. ఇప్పురేపు అధికారికంగా రాజీనామా ప్రకటన చేసిన తర్వాత, గ్రామ గ్రామాన తిరుగుతూ తన ఆవేదనను ప్రజలకు వివరించి, సానుభూతిని కూడగట్టాలని ప్లాన్ చేస్తున్నారు. జీవన్ రెడ్డి ఇప్పటికే తన తదుపరి రాజకీయ అడుగులపై ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రాథమిక చర్చలు పూర్తి చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తనను విస్మరించిందనే పాయింట్‌ను బలంగా వాడుకుంటూ మరొకపార్టీలో చేరడం ద్వారా తన ఉనికిని చాటుకోవాలని చూస్తున్నారు.
వయసుతో పాటు...
ఇక్కడ ప్రధానమైన చర్చ జీవన్ రెడ్డి వయసు, ఆయనకున్న ప్రజాదరణ పై కూడా ప్రజల్లో చర్చనీయాంశమైందని చెప్పాలి. జీవన్ రెడ్డి వయసు ప్రస్తుతం 75 ఏళ్లు దాటింది. ఈ వయసులో ఆయనకు అన్యాయం జరగడంపై సామాన్య జనం నుంచి కూడా సానుకూల స్పందన కనిపిస్తోంది. జగిత్యాల ప్రజలకు ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం తెలుసు.అప్పట్లో ఆయన చేసిన అభివృద్ధి, ఇప్పుడు ఆయన పడుతున్న ఆవేదన మధ్య ప్రజలు దేనికి ప్రాధాన్యత ఇస్తారనేది కీలకం. వయసు మళ్లిన వేళ ఆయన చూపే ఈ సెంటిమెంట్ కార్డ్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది చూడాలి. కానీ ఒకటి మాత్రం నిజం. జీవన్ రెడ్డికి అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నేతలే అంగీకరిస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా అదే భావనలోకి వస్తారన్న విశ్లేషణలు కూడా వినపడుతున్నాయి.
Next Story

