Fri Dec 05 2025 21:18:43 GMT+0000 (Coordinated Universal Time)
TDP : చంద్రబాబు ఆలోచన వెనక్కు తీసుకున్నారా?
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇక ఆశలు వదిలేసుకున్నట్లే కనిపిస్తుంది

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇక ఆశలు వదిలేసుకున్నట్లే కనిపిస్తుంది. గత ఏడాది ఆగస్టులో తెలంగాణ నేతలతో సమావేశమైన చంద్రబాబు ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. తాను ఇకపై తెలంగాణ నేతలతో టచ్ లో ఉంటానని, కమిటీలను నియమిస్తానని చెప్పారు. అలాగే సభ్యత్వాన్ని కూడా పెంచాలని కూడా చెప్పారు. ఓటు బ్యాంకు ఉందని, లీడర్లు లేకపోయినా ఖచ్చితంగా తెలంగాణలో ప్రజలు ఆదరిస్తారని చంద్రబాబు నమ్మకంతో చెప్పారు. అయితే తర్వాత ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు రాలేదు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చిన చంద్రబాబు తర్వాత మాత్రం ఇటు వైపు చూడటం లేదు.
కమిటీలను రద్దు చేసినా...
దీంతో పాటు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఉన్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. సభ్యత్వాలపై పూర్తిగా దృష్టి పెట్టాలని చంద్రబాబు పార్టీ నేతలను కోరారు. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయాలని, పెద్దయెత్తున సభ్యత్వాలు నమోదు చేయించిన నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని చంద్రబాబు తెలిపారు. తెలంగాణలో టీడీపీకి మంచి భవిష్యత్ ఉందని ఆయన తెలిపారు. అయితే తర్వాత మాత్రం ఆయన తెలంగాణ పార్టీని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ ను గాడిలో పెట్టడానికే ఆయనకు సమయం సరిపోతుంది. హైదరాబాద్ వచ్చినా ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చి నేతలతో సమావేశం కావడం లేదు.
కూటమి ఏర్పాటవుతుందని...
ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణలోనూ కూటమి ఏర్పాటవుతుందన్న ప్రచారం జరిగింది. ఇందులోనూ బీజేపీ, టీడీపీ, జనసేన తెలంగాణలో ఉంటాయని అందరూ అంచనా వేశారు. అయితే తెలంగాణ బీజేపీ నేతలు ఇందుకు సుముఖంగా లేరని తెలిసింది. దానివల్ల తెలంగాణ వ్యతిరేకుల ముద్ర పడి ఉన్న ఓటు బ్యాంకుకు గండి పడే అవకాశముందని బీజేపీ అంచనా వేసి టీడీపీతో పొత్తుకు తెలంగాణలో మాత్రం పెద్దగా సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలిసింది. కేవలం ఖమ్మం జిల్లాలోనూ, హైదరాబాద్ నగరంలో అక్కడక్కడా ఓటు బ్యాంకు ఉన్న టీడీపీతో పొత్తుతో వెళ్లేకంటే బీజేపీ, జనసేన కలసి తెలంగాణలో పోటీ చేయడం మంచిదన్న సూచనలు కేంద్ర నాయకత్వానికి అందాయి.
బీఆర్ఎస్ తో కలసి బీజేపీ...
మరొకవైపు కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణలో అధికారంలోకి రావడానికి అవసరమైతే బీఆర్ఎస్ తో చేతులు కలపాలని సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్, బీజేపీ వచ్చే శాసనసభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లే అవకాశముందన్న విశ్లేషణలు కూడా బాగా వెలువడుతున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ రజతోత్సవ సభలోనూ కేసీఆర్ కాంగ్రెస్ పై చేసిన విమర్శలు అధికంగా చేస్తే, బీజేపీని అలా టచ్ చేసి వదిలేయడం కూడా ఇందులో భాగమేననంటున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో జీరో స్థానాలు రావడంతో బీఆర్ఎస్ కూడా బీజేపీతో కలసి అధికారంలోకి వస్తే బాగుంటుందన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ లో కూడా బీజేపీ బలంగా ఉండటంతో కలసి పోటీ చేస్తే కాంగ్రెస్ ను సులువుగా ఓడించవచ్చునని, చంద్రబాబు తరహాలోనే తాను కూడాపొత్తుకు దిగితే తప్పేంటన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలిసింది. దీంతోనే తెలంగాణలో టీడీపీ బలోపేతానికి బ్రేక్ లు పడినట్లు సమాచారం.
Next Story

