Fri Dec 05 2025 13:29:41 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్నట్లే ఉందిగా.. అందుకేనా ఈ వరాలు
స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లే కనిపిస్తుంది

స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లే కనిపిస్తుంది. మంత్రులు ఇప్పటికే దీనిపై ప్రకటించినా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే త్వరలోనే స్థానికసంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. తెలంగాణలో తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిపేందుకు, తర్వాత మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించే దిశగా అడుగులు వేస్తునట్లు కనిపిస్తోంది. వరసగా తీసుకంటున్న నిర్ణయాలు స్థానిక ఎన్నికల్లో విజయం కోసమేనని చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికలలో పూర్తిగా పై చేయి సాధించే యత్నంలో భాగంగానే ఆర్థికంగా ఇబ్బందులున్నా వరస నిర్ణయాలతో అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి.
ఉద్యోగుల కోసమే...
ఇటీవల మంత్రివర్గ సమాశంలో ప్రభుత్వ ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న డీఏ ను మంజూరు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ, ఉద్యోగ, పింఛనర్లకు డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. డీఏను 3.64 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉతర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 26.39 శాతం ఇస్తుండగా, తాజా పెంపుతో అది 30.03 శాతానికి చేరింది.డీఏను జూన్ నెల వేతనంతో కలిపి జులై నెలలో చెల్లిస్తారు.. 2023 జనవరి ఒకటో తేదీ నుంచి 2025 మే 31వ తేదీ వరకూ ఇవ్వాల్సిన డీఏ బకాయీలను చెల్లించనున్నారు. సీపీఎస్ ఉద్యోగులకు పది శాతం డీఏ బకాయీలను ప్రాన్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
తొమ్మిది వేల కోట్లను..
తాజాగా రైతు భరోసా నిధులను విడుదల చేసింది. రైతురుణమాఫీ, రైతు భరోసా, వ్యవసాయ ఉచిత విద్యుత్తు, బీమా వంటి 1,01,728 కోట్లు రైతుల కోసం ఈ పద్దెనిమిది నెలల్లో ఖర్చు చేసింది. రైతుల కోసమే రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కోటి 49 ఎకరాలకు రైతు భరోసా నిధులను మంజూరు చేశారు. తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాదాపు ఏడు లక్షల మంది రైతులు లబ్ది పొందుతారని రేవంత్ రెడ్డి అన్నారు.దీంతో రైతులను కూడా తమ వైపు నకు తిప్పుకునేందుకు ఈ రకమైన నిర్ణయాలుతీసుకున్నట్లు కనపడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోపు మరికొన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయనుంది.
Next Story

