Fri Dec 05 2025 21:52:40 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Congress : అంతా ఢిల్లీ అయితే.. ఇక ఇక్కడ నిర్ణయాలు చేసేదెవరు?
తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ జరిగి నాలుగు రోజులవుతుంది. రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు మంత్రి వర్గ విస్తరణ చేపట్టారు

తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ జరిగి నాలుగు రోజులవుతుంది. రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు మంత్రి వర్గ విస్తరణ చేపట్టారు. అదీ ఆరు పోస్టులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఖాళీగా ఉంటే మూడు పోస్టులను భర్తీ చేయగలిగారు. అదీ సామాజిక న్యాయం కోణంలో మూడు పోస్టులను భర్తీ చేశారు. ఎస్సీ మాల సామాజికవర్గం నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎస్సీ మాదిగ సామాజికవర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్, బీసీ సామాజికవర్గానికి చెందిన వాకిటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ నెల 8వ తేదీన రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి నాలుగు రోజులవుతున్నప్పటికీ ఇప్పటి వరకూ మంత్రులకు శాఖలను కేటాయించలేదు.
చిన్న విషయాలకుకూడా...
మంత్రులకు శాఖలకు కేటాయింపు విషయంలో కూడా ఢిల్లీ వైపు చూస్తే ఎలా? అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మంత్రి వర్గంలో ఎవరిని తీసుకోవాలన్నది హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే పరవాలేదు కానీ, శాఖల కేటాయింపులో కూడా పార్టీ అధినాయకత్వం జోక్యం ఏంటన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ప్రతి చిన్న అంశానికి ఢిల్లీపై ఆధారపడలేదన్న విషయాన్నిగుర్తు చేస్తున్నారు. హైకమాండ్ పెత్తనం ఇటీవల కాలంలో ఎక్కువయిందన్న కామెంట్స్ సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రికి కనీసం ఫ్రీ హ్యాండ్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని సెటైర్లు సోషల్ మీడియాలో కనపడుతున్నాయి.
మూడు రోజుల నుంచి...
మంత్రులకు శాఖలకు కేటాయింపు సహజంగా ముఖ్యమంత్రి విచక్షణాధికారానికి వదిలేయాలి. ఎవరు ఆ శాఖను సమర్థవంతంగా చేయగలరన్నది ముఖ్యమంత్రి నిర్ణయించుకుని ఆ శాఖలను కేటాయిస్తారు. కానీ శాఖల కేటాయింపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల నుంచి ఢిల్లీలో పడిగాపులు కాయమేంటని విపక్షాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి, అవసరాలు ముఖ్యమంత్రికి వదిలేస్తే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటారు. అంతే తప్పించి ప్రతి చిన్న విషయానికి ఢిల్లీ వైపు చూడాలంటే ఎలా? అని కొందరు నెట్టింట ప్రశ్నిస్తున్నారు. మూడు రోజుల పాటు పాలనను పక్కన పెట్టి ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండటాన్ని తప్పు పడుతున్నారు.
రేవంత్ సర్దిచెబుతున్నా...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను మంత్రులకు శాఖలకు కేటాయింపు కోసం కాదని చెబుతున్నప్పటికీ అది నమ్మశక్యంగా లేదు. మూడు రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నది కులగణన కోసమంటే ఎవరు నమ్ముతారని, ఉత్తమ్, భట్టిని ఎందుకు పిలిచారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆదివారం కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తే సోమవారం ఉదయంపది గంటల వరకూ ముఖ్యమంత్రి హైదరాబాద్ లోనే ఉన్నారు. మరి ఎందుకు శాఖలను కేటాయించలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ప్రమాణ స్వీకారం చేసిన సాయంత్రానికే మంత్రులకు శాఖలను కేటాయించే వారని కొందరు గుర్తు చేస్తున్నారు. ప్రతి చిన్న విషయంలో ఢిల్లీ జోక్యం కూడా సరికాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Next Story

