Fri Dec 05 2025 13:35:12 GMT+0000 (Coordinated Universal Time)
ఈఈ ఆస్తులు చూస్తే నోరెళ్ల పెట్టాల్సిందే... విల్లాలు, బిల్డింగ్ లు.. కన్వెన్షన్ సెంటర్లు.. హోటళ్లు ఎన్నో?
ఇరిగేషన్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ నూనె శ్రీధర్ అక్రమాస్తులు 150 కోట్ల రూపాయలు దాటేశాయి

ఇరిగేషన్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ నూనె శ్రీధర్ అక్రమాస్తులు 150 కోట్ల రూపాయలు దాటేశాయి. ఇవి ఇప్పటి వరకూ గుర్తించిన ఆస్తులు మాత్రమే. ఇంకా మరిన్ని ఆస్తులు బయటపడే పడే అవకాశముంది. కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో ఇంజినీర్ గా పనిచేసిన నూనె శ్రీధర్ ఆస్తులను చూసిన అవినీతి నిరోధక శాఖ అధికారులకు కళ్లు బైర్లు కమ్మాయి. విలువైన ఆస్తులతో పాటు బంగారం, వెండి వస్తువులను కూడా కనుగొన్నారు. అనేక చోట్ల నివాస భవనాలతో పాటువ్యవసాయ భూములున్నాయని అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. నిన్నటి నుంచి సూపరింటెండెంట్ ఇంజినీర్ నూనె శ్రీధర్ ఇంట్లో, సన్నిహితుల ఇళ్లలో పన్నెండు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు...
సూపరింటెండెంట్ ఇంజినీర్ నూనె శ్రీధర్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనను న్యాయస్థానంలో ప్రవేశపెట్టి కస్టడీకి కోరే అవకాశముంది. ఇప్పటి వరకు రూ. 150 కోట్ల విలువైన *ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సూపరింటెండెంట్ ఇంజినీర్ నూనె శ్రీధర్ తన కుమారుడి పెళ్లికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారని కూడా ఏసీబీ అధికారుల విచారణలో వెల్లడయింది. ప్రస్తుతం శ్రీధర్ చొప్పదండి డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈగా పనిచేసినప్పుడు శ్రీధర్ కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
థాయ్ లాండ్ కు విమానంలో...
కుమారుడి వివాహం అంగరంగ వైభవంగా జరిపించిన నూనె శ్రీధర్ థాయ్ లాండ్ లో జరిగిన వివాహానికి అతిథులను విమానంలో తరలించినట్లు గుర్తించారు. మలక్ పేట్ లో నాలుగు అంతస్థుల ఇంటితో పాటు తెల్లాపూర్ లో విల్లా, షేక్ పేట్ లోని స్కూ హై గేటెడ్ కమ్యునిటీలో ఒక ఫ్లాట్, అమీర్ పేట్ లో కమర్షియల్ కాంప్లెక్స్, కరీంనగర్ లో మూడు ప్లాట్లు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లలో మూడుభవనాలు, పదహారు ఎకరాల వ్యవసాయ భూమితో పాటు 19 ఇళ్ల స్థలాలున్నాయని ఏసబీ అధకారులు గుర్తించారు. ఇవి కాకుండా హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లను కూడా శ్రీధర్ స్థాపించారని తెలుసుకున్నారు. రెండు కార్లు, విలువైన బంగారు ఆభరణాలు కూడా కనుగొన్నారు. ఇంకా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.
Next Story

