Sun Apr 05 2026 16:57:13 GMT+0530 (India Standard Time)
Summer Effect : ఎండాకాలంలో వానలు.. ఈ ప్రాంతాల్లో మాత్రం టెంపరేచర్స్ ఒక రేంజ్ లో
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నలభైకి పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరొకవైపు వాతావరణ శాఖ మాత్రం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని తెలిపింది. అయితే వానలు పడటం వల్ల వాతావరణం ఇంకా వేడెక్కుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని వైద్యులు చెబుతున్నారు. పగటి వేళ బయటకు రాకపోవడమే మంచిదని చెబుతున్నారు.
కొన్నిచోట్ల చిరుజల్లులు...
ఆంధ్రప్రదేశ్ లో కొన్ని చోట్ల చిరుజల్లులు పడతాయని, మరికొన్ని చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయని చెప్పింది.అదే సమయంలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నలభై నుంచి నలభై మూడు డిగ్రీల వరకూ నమోదవుతాయని చెప్పింది. వేడి గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ప్రధానంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో టెంపరేచర్స్ ఒక రేంజ్ లో ఉండే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
తెలంగాణలోనూ అక్కడక్కడ...
తెలంగాణలోనూ అక్కడక్కడ వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే మూడు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు కొంత తగ్గినట్లు కనిపించినా వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. హైదరాబాద్ నగరంలోనూ ఎండ తీవ్రతకు పగటి వేళ రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. రానున్నరోజుల్లో గరిష్టంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Next Story

