Sat Mar 07 2026 17:41:12 GMT+0530 (India Standard Time)
Telangana : తెలంగాణలో చలి తగ్గడం లేదుగా.. వణికిపోతున్న జనం
తెలంగాణలో చలి గాలుల తీవ్రత తగ్గడం లేదు. చలిగాలుల తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

తెలంగాణలో చలి గాలుల తీవ్రత తగ్గడం లేదు. చలిగాలుల తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం ఐదుగంటల నుంచి చలిగాలులు ప్రారంభమవుతున్నాయి. ఉదయం పది గంటల వరకూ చలిగాలుల తీవ్రత తగ్గడం లేదు. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని అనేక జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు గజగజ వణికపోతున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు అనేక జిల్లాల్లో చలిగాలుల తీవ్రతఎక్కువగా ఉంది. ఉదయం బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. అదే సమయంలో పొగమంచు కూడా వాహనదారులను ఇబ్బంది పెడుతుంది. రాకపోకలకు ఆటంకం కలిగిస్తుంది.
పొగమంచుతో ఇబ్బందులు...
ప్రధానంగా జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు అలుముకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రైళ్లు, విమానాల రాకపోకలు కూడా ఆలస్యమవుతున్నాయి. నిదానంగా ప్రయాణంచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముుందు పది నుంచి పదిహేను గజాల వరకూ అస్సలు కనిపించకపోవడంతో పగటి పూట హెడ్ లైట్స్ వేసుకుని మరీ వాహనాలు వెళ్లాల్సి వస్తుంది. ఇటీవల కొంత చలి తీవ్రత తగ్గింది. అయితే మళ్లీ చలిగాలులు విజృంభిస్తుండటంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు వంటి వాటితో ఇబ్బంది పడుతూ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి.
కనిష్ట ఉష్ణోగ్రతలు..
ఇక వృద్ధులు,చిన్న పిల్లలు, దీర్ఘకాలిక రోగులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అత్యల్పంగా మెదక్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కొహిర్ లో 6.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కృష్ణాపూర్ లో 9.7 డిగ్రీలు, నర్సాపూర్ లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో 10.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఈ చలిగాలులనుంచి వీలయినంత దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.రానున్న కాలంలో మరింత చలితీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

