Mon Jan 19 2026 18:30:51 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : మరో బాంబు పేల్చిన వాతావరణ శాఖ.. ఈ ఏడాది ఎండలు అదుర్స్ అట
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత చాలా వరకూ తగ్గింది

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత చాలా వరకూ తగ్గింది. క్రమంగా వేసవిని తలపిస్తుంది. ఉదయం, రాత్రి వేళల్లో కొంత చలి అనిపిస్తున్నప్పటికీ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ ఉక్కపోత కనిపిస్తుంది. గత నవంబరు నెల నుంచి చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నవంబరు నెల మధ్య నుంచి మొదలయిన చలితీవత్ర జనవరి మధ్య వరకూ కొనసాగింది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు చలికి గజ గజ వణికిపోయారు.
పొగమంచుతో పాటు...
ఆంధ్రప్రదేశ్ లోనూ చలితీవ్రత ఎక్కువగా ఈ ఏడాది కనిపించింది. పొగమంచుతో పాటు ఏజెన్సీ ఏరియాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో చలి ఈ సారి ఎక్కువగా ఉంది. చలి మాత్రమే కాదు.. వానలు.. వరదలు కూడా ఎక్కువగా సంభవించాయి. బంగాళాఖాతంలో తరచూ అల్పపీడనాలు ఏర్పడటం, వాయుగుండంగా మారి రైతులను, ప్రజలను ఇబ్బంది పెట్టాయి. ఇక చలి తగ్గినప్పటికీ ఈ ఏడాది ఎండలు కూడా అదే తీవ్ర స్థాయిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చలి తగ్గినప్పటికీ...
తెలంగాణలోనూ చలితీవ్రత చాలా వరకూ తగ్గింది. నిన్న మొన్నటి వరకూ విద్యుత్తును వినియోగించేవారు తక్కువే. ఫ్యాన్ లు కూడా వేసుకునే వారు కారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఫ్యాన్లు మూడు మీద పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. చలి తీవ్రత పూర్తిగా తగ్గిపోవడంతో కొంత ఊపరి పీల్చుకున్నప్పటికీ జనం ఈ సారి ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని తలచుకుని భయపడిపోతున్నారు. వాతావరణ శాఖ కూడా ఈ సారి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో వచ్చే మార్చి నెల నుంచి భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. సో.. అత్యంత కనిష్ట డిగ్రీల మధ్య గడిపిన ప్రజలు గరిష్ట ఉష్ణోగ్రతల మధ్య జీవించేందుకు రెడీ అయిపోవాల్సిందే.
Next Story

