Mon Mar 23 2026 08:47:10 GMT+0530 (India Standard Time)
Weather Report : చలితీవ్రత పెరుగుతున్నప్పటికీ.. రానున్న రోజుల్లో మాత్రం?
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పూర్తి స్థాయిలో తగ్గలేదు

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పూర్తి స్థాయిలో తగ్గలేదు. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రత మళ్లీ ఎక్కువువుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దట్టమైన పొగమంచు కూడా అలుముకుంటోందని చెప్పింది. పగటి ఉష్ణోగ్రతలు మాత్రం గణనీయంగా పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, అయితే ఈ నెల రెండో వారానికి చలి తీవ్రత పూర్తిగా తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
భానుడి భగభగలు...
ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నట్లే కనిపిస్తున్నాయి. ఉదయం పది నుంచి భానుడి భగభగలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ముప్ఫయి మూడు డిగ్రీల కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మిగిలిన ప్రాంతాల్లోనూ ముప్ఫయి డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈరోజు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని చెప్పినప్పటికీ, ఎండలు అయితే మరింత ఉధృతమవుతాయన్న హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఉక్కపోత వాతావరణం ఏపీ తీర ప్రాంత ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
పొడి వాతావరణం ఉన్నప్పటికీ...
తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల మాత్రం ఇంకా చలిగాలుల తీవ్రత తగ్గలేదని, ప్రధానంగా కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో చలి కొంత కనపడుతుంది. ఆగ్నేయ, తూర్పు దిశ నుంచి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది. అదే సమయంలో అక్కడక్కడ పొగమంచు ప్రభావం కనిపిస్తుందని తెలిపింది. వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తెలంగాణలోనూ పగటి ఉష్ణోగ్రతలు ఇప్పటికే ముప్ఫయి డిగ్రీలు దాటాయి. రానున్న కాలంలో మరింతగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Next Story

