Tue Jan 20 2026 07:54:39 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : చలి తీవ్రత మళ్లీ పెరిగిందా..అందుకు కారణాలివేనా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంత చలితీవ్రత మళ్లీ పెరిగింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంత చలితీవ్రత మళ్లీ పెరిగింది. సంక్రాంతి నుంచి రెండు రోజుల పాటు ఉక్కపోత వాతావరణం కనిపించినప్పటికీ మళ్లీ చలి తీవ్రత మొదలయింది. తెల్లవారు జాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకూ చలితీవ్రత కొంత ఎక్కువగా ఉంటుంది. ఏడు గంటలకే సూర్యుడు కనిపిస్తున్నప్పటికీ ఇంకా దుప్పటి ముసుగు మాత్రం తీయలేని విధంగా చలి తీవ్రత కొనసాగుతుంది. మరో రెండు నుంచి మూడు రోజుల పాటు ఇదేపరిస్థితి ఉంటుందని, తర్వాత మాత్రం ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఏపీలో పొగమంచు ఎక్కువగా...
ఆంధ్రప్రదేశ్ లో కొంత ఉష్ణోగ్రతలు గతంలో కంటే కొంత పెరిగినప్పటికీ పొగమంచు మాత్రం ప్రజలను ఇబ్బంది పెడుతుంది. పొగమంచు ఏజెన్సీ ఏరియాలోనే కాకుండా అన్ని ప్రాంతాల్లో అలుముకుంటుంది. పర్యాటకులకు కొంత పొగమంచు ఆహ్లాదకరంగా కనిపించినప్పటికీ వాహనదారులకు మాత్రం ఇబ్బందిగా తయారైంది. ఉదయం తొమ్మిది గంటల వరకూ పొగమంచు వీడటం లేదు. వాహనాలు జాతీయ రహదారిపై నెమ్మదిగా సాగుతున్నాయి. నేడు కూడా పొగమంచు తీవ్రంగానే ఉంటుందని వాహనదారులు అలెర్ట్ గా ఉండాలని హెచ్చరించింది.
తెలంగాణలో చలి తీవ్రత..
తెలంగాణలో మళ్లీ చలి తీవ్రత పెరిగింది. ఆదిలాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో చలి ఎక్కువగా ఉంది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. పలు జిల్లాల్లో సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం ఉంటుందని పేర్కొంది. అయితే క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.ఇప్పటికే కొన్నిప్రాంతాల్లో డబుల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది.
Next Story

