Sun Oct 13 2024 20:16:02 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : రేవంత్ ను టార్గెట్ చేసుకున్నారా? హైడ్రా అస్త్రం దొరికిందా?
తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు విపక్షాలకు ఒక ఊతంలాగా దొరికాయి. రేవంత్ రెడ్డి టార్గెట్ అవుతున్నారు
తెలంగాణలో హడ్రా కూల్చివేతలు విపక్షాలకు ఒక ఊతంలాగా దొరికాయి. పూర్తిగా నైరాశ్యంలో ఉన్న విపక్ష పార్టీలకు హైడ్రా కూల్చివేతలు కలసి వచ్చాయనే ప్రచారం సోషల్ మీడియాలో నడుస్తుంది. నిజానికి నగరానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా హైడ్రా కూల్చివేతలపై కొంత విముఖత చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ఒక మంచి పనిచేసినప్పుడు ఇలాంటి విమర్శలు, ఆరోపణలు సహజమే. ఎందుకంటే ఒక సదుద్దేశ్యంతో చేసే పనికి ఆటంకాలు కూడా అదే మాదిరిగా వస్తుంటాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయి.
గత ఎన్నికల్లో....
హైదరాబాద్ నగరంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. అందుకే కక్ష సాధింపు చర్యతో ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు కూల్చివేతలకు శ్రీకారం చుట్టిందని సోషల్ మీడియాలో అనేక పోస్టులు కనిపిస్తున్నాయి. నిజానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉంది. నిజంగా రాజకీయ కోణంలో ఆలోచించే వారయితే రేవంత్ ఆ పనిచేయరన్నది కూడా అంతే వాస్తవం. ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు తమ ఇళ్లను కూలిస్తే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశముందని ఆయనకు తెలియంది కాదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అవేమీ పట్టించుకోకుండా మూసీనది ప్రక్షాళనతో పాటు సుందరీకరణకు ఆయన నడుంబిగించారు.
నష్టపోయేది ఎవరు?
చెరువులను, నాలాలను, కుంటలను ఆక్రమిస్తే నష్టపోయేది ఎవరు? ప్రజలు కాదా? వరదలు వచ్చినప్పుడు సంపాదించుకున్న, కూడబెట్టుకున్న కొద్దిపాటి వస్తువులు కూడా వరదల ధాటికి కోల్పోవాల్సి వస్తుందన్నది అనేక సార్లు రుజువుయింది. ప్రజలు ఇబ్బంది పడకూడదనే, భవిష్యత్ లో కోట్లాది మంది హైదరాబాదీలను రక్షించడానికే ఇలాంటి ఆక్రమణలను తొలగిస్తున్నామని చెబుతున్నప్పటికీ ఆక్రమణదారుల చెవిల కెక్కడం లేదు. దీనికి తోడు కూల్చివేతలు రాజకీయంగా రగులుకుంటుండటంతో ప్రభుత్వం కూడా ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంది. నిజానికి రాజకీయ పార్టీలు, హైదరాబాద్ బాగు కోరుకునే వారు ఎవరైనా ఈ ప్రతిపాదనలను అంగీకరించాలి. కానీ అలా చేయడం లేదు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం...
ఇక ఇప్పటి వరకూ హైదరాబాద్ నగరానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా కూల్చివేతల దెబ్బకు బీఆర్ఎస్ నుంచి వచ్చేందుకు ఇష్టపడటం లేదన్న వార్తలు కూడా కాంగ్రెస్ నేతలను కొంత వణికిస్తున్నాయి. మొన్నటి వరకూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు ఇప్పుడు పునరాలోచనలో పడినట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లు రియాక్ట్ అయ్యారు. తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియాపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆక్రమణదారుల ఇళ్ల కూల్చివేతతో ప్రభుత్వం ఊరుకోవడం లేదని, వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తున్నామని, గతంలో బీఆర్ఎస్ గౌరవెల్లి, మల్లన్న సాగ్ ప్రాజెక్టు బాధితులపై లాఠీ ఛార్జి చేసినట్లు తాము బాధితులపై జరపడం లేదన్నారు. ప్రజలను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారని, ఇటువంటి పనులను మానుకోవాలని హితవు పలికారు.
Next Story