Tue Feb 03 2026 22:15:50 GMT+0000 (Coordinated Universal Time)
అవుటర్ రింగురోడ్డుపై కూల్ డ్రింక్స్ బాటిల్స్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తా
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారమతిపేట సమీపంలో థమ్స్అప్ బాటిల్స్ లోడుతో వెళ్తున్న లారీ గత రాత్రి దాదాపు 8 గంటల సమయంలో..

అబ్దుల్లాపూర్‌మెట్ : అవుటర్ రింగురోడ్డుపై థమ్స్అప్ బాటిల్స్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో అదే మార్గంలో ప్రయాణిస్తున్న వారు అక్కడ ఆగి థమ్స్అప్ సీసాలను ఎత్తుకెళ్లేందుకు తెగ ఆరాటపడ్డారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారమతిపేట సమీపంలో థమ్స్అప్ బాటిల్స్ లోడుతో వెళ్తున్న లారీ గత రాత్రి దాదాపు 8 గంటల సమయంలో ఓఆర్ఆర్పై వెళ్తూ అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో థమ్స్అప్ బాటిల్స్ అన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు.
ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారు తమ వాహనాలను ఆపి రోడ్డుపై పడిన థమ్స్అప్ బాటిల్స్‌ను ఎత్తుకెళ్లారు. గాయాలతో మూలుగుతున్న డ్రైవర్, క్లీనర్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా లారీలోని సరుకు మొత్తాన్ని ఖాళీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వాహనం అబ్దుల్లాపూర్‌మెట్ వైపు వెళుతుండగా చాలా వేగంగా డ్రైవింగ్ చేయడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, వాహనం తిరగబడిన వెంటనే గుమికూడిన జనం శీతల పానీయం సీసాలు పట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసులు లారీని పక్కకు తరలించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
Next Story

