హైదరాబాద్ టూ శ్రీశైలం హెలికాప్టర్ లో
పర్యాటక శాఖ హైదరాబాద్ నుండి శ్రీశైలం వరకు హెలికాప్టర్ సేవలు నడపాలని నిర్ణయం తీసుకుంది.

పర్యాటక శాఖ హైదరాబాద్ నుండి శ్రీశైలం వరకు హెలికాప్టర్ సేవలు నడపాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా హెలీ టూరిజంపై ఫోకస్పెట్టింది. ‘ఈజ్ మై ట్రిప్’ వంటి ప్రముఖ సంస్థలతోపాటు ఇతర ప్రైవేట్ ఎయిర్ లైన్స్ కంపెనీలతో పలు దఫాలుగా చర్చలు జరిపింది. వచ్చేఏడాది జనవరి మొదటి వారం లేదా సంక్రాంతి నుంచి ఈ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నాయి. తొలుత వారాంతాల్లో ఈ సర్వీసులను నడిపి, ఆదరణను బట్టి విస్తరించాలని టూరిజం అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన హెలికాప్టర్, నల్లమల్ల అడవుల మధ్యలో కృష్ణా నది ఒడ్డున ఉన్న సోమశిల, అమరగిరి అందాలను చూపిస్తూ శ్రీశైలం చేరుకుంటుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి 220 కిలో మీటర్ల వరకు ఉంటుంది. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. అదే హెలికాప్టర్ ద్వారా ప్రయాణం చేస్తే గంటలోపే గమ్యాన్ని చేరుకోవచ్చు. హెలీ టూరిజం కోసం రెండు నుంచి మూడు రోజుల ప్యాకేజీలను పర్యాటక శాఖ రూపొందించింది. ప్రయాణం, వసతి, దర్శనం వంటి అన్ని సౌకర్యాలను కలిపి త్వరలోనే ధరలను ఖరారు చేయనున్నారు.

