Fri Dec 05 2025 15:51:19 GMT+0000 (Coordinated Universal Time)
హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేత.. ఆ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలి
భారీగా కురుస్తున్న వానలకు హైదరాబాద్ నగరం తడిసిముద్దవుతుంది. ఎడతెరిపిలేని వర్షాల

భారీగా కురుస్తున్న వానలకు హైదరాబాద్ నగరం తడిసిముద్దవుతుంది. ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేస్తుండటంతో మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో హిమాయత్ సాగర్ రెండు గేట్లను తెరిచారు. హిమాయత్ సాగర్ నుండి 1373 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ రెండు గేట్లను కూడా ఎత్తివేశారు. అవుట్ ఫ్లో 442 క్యూసెక్కులు ఉంది.
వర్షం కారణంగా రాజేంద్ర నగర్ జంట జలాశయాలకు భారీగా వరద వస్తోంది. దీంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు ఎత్తివేశారు. మరి కాసేపట్లో మరో నాలుగు గేట్లు ఎత్తే అవకాశం. హుస్సేన్ సాగర్ వాటర్ లెవెల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అధికారులు అందుబాటులో ఉండాలని జిహెచ్ఎంసి ఆదేశాలు జారీ చేసింది. మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తోంది. జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు పరిసర ప్రాంతాల వాసులను అప్రమత్తం చేశారు. మరికొన్ని గంటల్లో గేట్లు తెరిచే అవకాశం ఉందని సమాచారం.
సోమవారం రాత్రి నుంచి హైదరాబాద్ నగరంలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో కురుస్తున్నవర్షాల నేపథ్యంలోనే మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను అప్రమత్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Next Story

