Wed Dec 17 2025 12:55:22 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : మరో మూడు రోజులు వర్షాలు.. తీవ్ర వడగాలులు ఎక్కడెక్కడంటే?
తెలంగాణలో మరో మూడురోజులు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది.

తెలంగాణలో మరో మూడురోజులు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. మరో మూడు రోజులు తెలంగాణలో తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పింది. ప్రస్తుతం నమోదవుతున్న సాధారణ ఉష్ణోగ్రతలకంటే తక్కువగా నమోదవుతాయని, రెండు మూడు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని చెప్పింది. అలాగే అనేక జిల్లాల్లో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా పేర్కొంది. కొన్ని చోట్ల వడగళ్లతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. కొన్ని జిల్లాలకు ెల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది.
ముప్ఫయి మూడు జిల్లాల్లో...
తెలంగాణలో ముప్ఫయి మూడు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ శాఖ కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు నలభై రెండు డిగ్రీల వరకూ నమోదవుతాయని చెప్పింది. పగటి వేళల్లో వడగాలులు వీచే అవకాశముందని, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, చిన్నపిల్లలు, గర్భిణులు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే మంచిదని అధికారులు సూచించారు. ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ వీలయినంత వరకూ ఎవరూ బయటకు రాకపోవడమే మంచిదని సూచించింది. అలాగే రైతులు తమ పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు ప్రయత్నించాలని, అకాల వర్షాలు పంటలను దెబ్బతీసే అవకాశముందని కూడా తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లో కూడా...
ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు పడతాయని చెప్పింది. అదే సమయంలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతాయని చెప్పింది. ఇక ఈరోజు ఏడు మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా మన్యం జిల్లా పాలకొండ, కాకినాడ జిల్లా ఏలేశ్వరం, తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలాల్లో తీవ్ర వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అలాగే నలభై ఆరు మండలాల్లో వడగాలులు వీస్తాయని చెప్పింది. కొన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, అలాగే కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. వీలయినంత వరకూ ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే మంచిదని సూచించింది.
Next Story

