Tue Feb 17 2026 12:45:45 GMT+0530 (India Standard Time)
Weather Report : బాబోయ్ ఇవేం ఎండలు.. ప్రాణాలు పోతాయా ఏంది?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వేడి వాతావరణం ప్రారంభమయింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వేడి వాతావరణం ప్రారంభమయింది.శివరాత్రి తర్వాత చలి పూర్తిగా కనుమరుగవుతుందన్న పెద్దల మాటలు నిజమవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు ఎండలతో ఉడికిపోతున్నాయి. ఉదయం వేళ, తెల్లవారు జామున కొంత చలి అనిపిస్తున్నప్పటికీ ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నారు. ఎండలు ముదురుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అక్కడకక్కడ పొగమంచు వాతావరణం మాత్రం నెలకొని ఉంటుంది.
ఏపీలో ఎండలు ముదిరి...
ఆంధ్రప్రదేశ్ లో ఎండల తీవ్రత ఎక్కువయింది. మండు టెండలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. అయితే ఉదయం వేళ మాత్రం పొగమంచు ఇంకా వదలలేదు. ఉదయం ఎనిమిది గంటల వరకూ గన్నవరం ఎయిర్ పోర్టులో విమానాల ల్యాండింగ్ కు కష్టంగా మారింది. నిన్న బిల్ గేట్స్ విమానం కూడా పొగమంచు కారణంగా చాలా సేపు చక్కర్లు కొట్టింది. కానీ 9 గంటల నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర అందులోనూ పల్నాడు జిల్లాల్లో ఎండలు గరిష్టంగా నమోదవుతున్నాయి. 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలో మాత్రం కొంత కనిష్టంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలోనూ ఉక్కపోత...
తెలంగాణలోనూ ఉక్కపోత వాతావరణం మొదలయింది. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పగటి పూట ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఏపీతో పోలిస్తే కొంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 30 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాత్రి వేళ 25 డిగ్రీలు, పగటి వేళ 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి నెలలో ఇంకా వాతావరణం వేడెక్కకుతుందని చెబుతున్నారు. ఏజెన్సీ ఏరియాల్లోనూ చలి తీవ్రత పూర్తిగా తగ్గింది. ఇక దాదాపుగా చలి తొలిగిపోయి ఉక్కపోత కురుస్తుండటంతో విద్యుత్తు వినియోగం కూడా గణనీయంగా పెరిగింది.
Next Story

