Sat Dec 13 2025 22:33:20 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : హెటిరోను మూసివేయండి.. నీళ్లు కలుషితం.. ఆహారం విషతుల్యం
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోని దోమడుగు ప్రాంత ప్రజలు ఆందోళనకు దిగారు

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోని దోమడుగు ప్రాంత ప్రజలు ఆందోళనకు దిగారు. కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ గ్రామంలోని నీటి వనరులను, భూగర్భ జలాలను కలుషితం చేస్తూ, తమకు అన్ని విధాలుగా నష్టం చేకూర్చుతున్న కాలుష్యకారక కంపెనీలకు వ్యతిరేకంగా దోమడుగు ప్రజలు ప్రదర్శన నిర్వహించారు. నల్లకుంట చెరువు పూర్తిగా విషతుల్యం కావడంతో గత కొన్ని రోజులుగా వాళ్ళు వివిధ రూపాల్లో పోరాటం కొనసాగిస్తున్నారు. శనివారం స్థానికులందరూ కలిసి, వివిధ ప్రజాసంఘాల మద్దతుతో కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. నల్లకుంట చెరువు కలుషితం కావడానికి హెటిరో డ్రగ్స్ యూనిట్- 1 కారణమంటూ వాళ్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
పరిశ్రమను మూసివేయాలంటూ...
తక్షణమే ఈ పరిశ్రమను మూసివేయాలని డిమాండ్ చేశారు. కాలుష్య జలాల కారణంగా చనిపోయిన పశువుల చిత్రాను ఊరేగింపులో ప్రదర్శించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని, తమ ఊరికి తీవ్ర నష్టం చేస్తున్న కాలుష్యకారక కంపెనీలపై చర్యలు తీసుకోవాలని నినదించారు. కనీసం తమ గ్రామంలో పండిన బియ్యం కూడా ఎవరు కొనడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దోమడుగు బియ్యం అని చెబితేనే ఎవరు కొనడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలుషిత జలాల వల్ల బోర్లలోను నీళ్లన్నీ కలుషితం అయ్యాయని మహిళలు ఈ సందర్భంగా వివరించారు. చిన్నపిల్లల ఎముకలు సైతం అరిగిపోతున్నాయని, డాక్టర్ల వద్దకు వెళ్తే తాగుతున్న నీళ్లే కారణమని చెబుతున్నారని వాళ్ళు వివరించారు.
కాలుష్య నియంత్రణ మండలి కంపెనీతో కుమ్మక్కై...
తమ ఆరోగ్యాలు పాడైపోతున్నాయని, ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. విపరీతమైన ఘాటైన వాసనల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమ ఊర్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉండడంతో, కనీసం చుట్టాలు కూడా తమ ఇండ్లకు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లను తాగిన పశువులు మృత్యువాత పడుతున్నాయని వివరించారు.కాలుష్యకారక కంపెనీ హెటిరోను మూసివేయని పక్షంలో, తమ నిరసనను కొనసాగిస్తామని గ్రామస్తులు నినదించారు. ఇంత జరుగుతున్న ఏమాత్రం పట్టించుకోకుండా కంపెనీ యాజమాన్యానికే వత్తాసు పలుకుతున్న కాలుష్య నియంత్రణ మండలి అధికారుల తీరును ఎండగట్టారు.
మూసివేయకుంటే...
అవినీతి అధికారుల పైన చర్యలు తీసుకోవాలని కోరారు. కంపెనీని మూసివేయకుంటే తాము ఇక్కడ ఉండలేమని, తమ గ్రామాన్ని రక్షించుకోవాలంటే కంపెనీని మూసివేయాలని ఆందోళన చేయడమే తమ ముందున్న మార్గమని వారు అన్నారు. కంపెనీని ఇక్కడి నుంచి తరలించకుంటే ఆందోళన ఉధృత చేస్తామని హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమంలో మీరా సంఘమిత్ర, ఎన్ఏపీఎం జాతీయ నాయకురాలు, టీపీజేఏసీ నాయకులు రాజగోపాల్ రెడ్డి, ముత్యాలు, శ్రీనివాస్, ప్రజా ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ప్రతినిధులు దీప్తి, హేమంత్, విజయలక్ష్మి, కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ మంగయ్య, సభ్యులు బాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, స్వేచ్ఛ రెడ్డి, ఆనంద్ రెడ్డి, శ్రీధర్, ఎల్లారెడ్డి, మురారి మధుకర్, సత్తిరెడ్డి, కిష్టారెడ్డి, బాలు గౌడ్, ఎం.యాదగిరి, పి. శంకరయ్య, బొంది వెంకటేష్, జయమ్మ, స్వప్న, శారద తదితరులు పాల్గొన్నారు.
Next Story

