Mon Jan 05 2026 10:02:36 GMT+0000 (Coordinated Universal Time)
Harish Rao : చీమునెత్తురున్నోడివైతే... మనిషివైతే రాజనామా చేయ్.. రేవంత్ కు హరీశ్ సవాల్
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నీరు గార్చింది రేవంత్ రెడ్డి మాత్రమేనని హరీశ్ రావు అన్నారు

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నీరు గార్చింది రేవంత్ రెడ్డి మాత్రమేనని హరీశ్ రావు అన్నారు. ఆయన తెలంగాణ భవన్ లో నీటి పారుదల అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరాన్ని కాలరాసిందని, పాలమూరును పండబెట్టిందని ఆరోపించారు. కృష్ణా నది ద్వారా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని చెప్పారు. పాలమూరు వలసలకు కారణం కాంగ్రెస్ మాత్రమేనని హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ హయాంలో కోటి ఎకరాలకు సాగు నీరందిందని తెలిపారు. అందువల్లనే తెలంగాణ వరి పండించడంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుందని హరీశ్ రావు తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలోనే...
బీఆర్ఎస్ హయాంలో అనేక ప్రాజెక్టులను పూర్తి చేశామన్న హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి తమ పార్టీని బద్నాం చేస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దోచుకోవడమే కాని, పిడికెడు బువ్వ పెట్టిన పాపాన ఎన్నడూ పోలేదన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అన్నీ అబద్ధాలే శాసనసభలో చెప్పాలన్నారు. నాడు తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ తో కలిపి మరణ శాసనం రాసింది కాంగ్రెస్ మాత్రమేననిహరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత నీటిపారుదల విషయంలోనూ, తాగు నీటి విషయంలోనూ సరైన చర్యలు తీసుకోవడం వల్లనే ఈనాడు భూముల విలువ కోట్ల రూపాయలకు పెరిగిందని గుర్తు చేశారు.
తెలంగాణను మోసం చేసింది కాంగ్రెస్ ....
తెలంగాణ ఉద్యమాన్ని గత కొన్ని దశాబ్దాలుగా నీరు గార్చింది కాంగ్రెస్ మాత్రమేనని హరీశ్ రావు అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఇచ్చిన తెలంగాణను వెనక్కు తీసుకుని వందలాది మంది యువకుల ప్రాణాలను బలితీసుకుంది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎన్ని లక్షల ఎకరాలకు సాగు నీరందిందో తెలుసా? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అటువంటి కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. అసెంబ్లీని, రైతులను, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడిన రేవంత్ రెడ్డి నాలుక కోయాలని హరీశ్ రావు అన్నారు. చీము నెత్తురున్నోడయితే.. మనిషైతే నేరుగా రాజీనామా చేయాలని హరీశ్ రావు అన్నారు. ఈ మాటలు అన్నందుకు తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తాడని, అయినా తనకు భయం లేదని అన్నారు.
Next Story

