Sat Dec 13 2025 22:33:55 GMT+0000 (Coordinated Universal Time)
అతి పెద్ద భూం స్కాం ఇది : హరీశ్ రావు
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పాలసీ మరొక తాజా స్కాం అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పాలసీ మరొక తాజా స్కాం అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కుంభకోణాకలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కొత్త చేస్తున్న స్కామే ఈ కొత్త పాలసీ అని అన్నారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్ఫర్మేషన్ పాలసీ కాదు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ లూటింగ్ పాలసీ అని హరీశ్ రావు చెప్పారు. పారిశ్రామిక వాడల్లోని దాదాపు పది వేల ఎకరాల భూమిని పప్పు బెల్లాల్లా అమ్ముకునే కుట్రకు రేవంత్ ప్రభుత్వం తెరలేపిందన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా అడ్డగోలు దోపిడీ మీదనే దృష్టి రేవంత్ రెడ్డి పెట్టారని, లగచర్ల కావొచ్చు, హెచ్ సీయూ భూములు కావొచ్చు. ఇలా ఏది చూసినా దోపిడీనే అని హరీశ్ రావు మండి పడ్డారు.
దోపిడీ చేయాలన్నదే...
ప్రజలకు ఏం చేయాలనే ధోరణి కంటే కూడా, ఎక్కడ ఎంత దోపిడి చేయాలన్నదే రేవంతు ఆలోచన విధానం కొనసాగుతుందని అన్నారు. తమ హయాంలో అనుమతులు వార్తలు, పెట్టుబడుల వార్తలు వచ్చేవి. అమ్మకాల వార్తలు కాంగ్రెస్ హయాంలో వస్తున్నాయన్నారు. తమది నమ్మకాన్ని పెంచిన ప్రభుత్వం అయితే, కాంగ్రెస్ అమ్మకాన్ని పెంచిన ప్రభుత్వం అని హరీశ్ రావు అన్నారు. గజాల లెక్కన మొదలు కొని, వేల ఎకరాల దాకా ప్రతి ఇంచు భూమి అమ్మేస్తున్నారని రేవంత్ రెడ్డి పై హరీశ్ రావు ఫైర్ అయ్యారు. హౌసింగ్ బోర్డు లో ఉన్న ఆరు గజాలు, ఎనిమిది గజాలు కూడా అమ్ముతున్నారన్నారు. గతంలో ఇదే రేవంత్ రెడ్డి భూములు అమ్ముకుంటూ పోతే ఎలా, ఆసుపత్రులు, విద్యాలయాలు చివరకు స్మశానాలు ఏర్పాటు చేయడానికి కూడా భూములు మిగలవు అన్నారని గుర్తుచేశారు. నాడు సుద్దపూస లెక్క మాట్లాడి, ఇప్పుడు భూములు తెగనమ్ముతున్నారని హరీశ్ రావు ఆరోపించారు.
Next Story

