Thu Jun 12 2025 19:35:18 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేడు కాళేశ్వరం కమిషన్ ఎదుటకు కేసీఆర్.. అక్కడ ఆంక్షలు ఎలా ఉన్నాయో తెలుసా?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జస్టిస్ పీసీ చంద్రఘోష్ కమిషన్ ఎదుట హాజరు కానున్నారు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జస్టిస్ పీసీ చంద్రఘోష్ కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కమిషన్ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు. ఉదయం పదకొండు గంటలకు బీఆర్కే భవన్ లోని కాళేశ్వరం కమిషన్ ఎదుటకు కేసీఆర్ రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్దయెత్తున అవినీతి, అక్రమాలు జరిగిందన్న ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పీసీ చంద్రఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. ఇప్పటి వరకూ కమిషన్ 114 మందిని విచారించింది. నీటిపారుదల శాఖ నిపుణులు, మాజీ ఇంజినీర్లతో పాటు రాజకీయ నేతలను కూడా కమిషన్ ఇప్పటి వరకూ ప్రశ్నించింది.
బీఆర్ఎస్ వాదనలు ఇలా...
ఇటీవల అప్పటి ఆర్ధిక మంత్రిగా ఉన్న ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ను, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రావులను కూడా పీసీ చంద్రఘోష్ కమిషన్ ప్రశ్నించింది. ఇద్దరినీ నలభై నిమిషాలు ప్రశ్నలు వేసింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కలల ప్రాజెక్టు. ఆయన ఆలోచనతోనే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని చెబుతారు. తెలంగాణలోని కోటి ఎకరాలకు సాగు నీరందించడంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని బీఆర్ఎస్ నేతలు చెబుతారు. ఈ ప్రాజెక్టుతో లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందుతుందని అంటున్నారు. తెలంగాణలో వ్యవసాయం పండగలా మారిందని, ధాన్యం ఉత్పత్తి కూడా దేశంలో ఇతర రాష్ట్రాల కంటే పెరిగిందని చెబుతారు.
ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి...
అయితే లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పెద్దయెత్తున అవినీతి జరిగిందని, ప్రాజెక్టు నిర్మాణం చేసే స్థలాన్ని కూడా మార్చారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కమిషన్ ముందు ఏ విషయాలు చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఈ నెల 5వ తేదీన కమిషన్ ఎదుటకు రావాలని కేసీఆర్ కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే తాను ప్రాజెక్టుపై అధ్యయనం చేస్తున్నానని, తనకు కొంత సమయం కావాలనిఈ నెల 11వ తేదీన హాజరవుతానని కేసీఆర్ పీసీ చంద్రఘోష్ కమిషన్ కు చెప్పడంతో అంగీకరించింది. నేడు ఎనిమిది గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు.
బీఆర్కే భవన్ వద్ద భారీ బందోబస్తు...
ఫామ్ హౌస్ కు ఎవరూ రావద్దని బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ నేతలు ప్రకటన ద్వారా కోరారు. మరొక వైపు బీఆర్కే భవన్ వద్ద భారీ జనసమీకరణ చేయాలని బీఆర్ఎస్ భావిస్తుంది. దీంతో అక్కడ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరై ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కేసీఆర్ ను కూడా దాదాపు నలభై నుంచి గంట సేపు కమిషన్ విచారించే అవకాశాలున్నాయి. ఆర్థిక అనుమతుల నుంచి ప్రాజెక్టుల డిజైన్, ఆమోదం, మేడిగడ్డ బ్యారేజీ కూలడం, నాణ్యత వంటి అంశాలపై కేసీఆర్ ను పీసీ చంద్రఘోష్ కమిషన్ ప్రశ్నించే అవకాశాలున్నాయని అంటున్నారు.
Next Story