Fri Dec 05 2025 06:21:06 GMT+0000 (Coordinated Universal Time)
KCR : కేసీఆర్ కుంగిపోయారా... పార్టీపై గులాబీ బాస్ పట్టుకోల్పోయారా?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ బంధంలో చిక్కుకున్నట్లే కనిపిస్తుంది

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ బంధంలో చిక్కుకున్నట్లే కనిపిస్తుంది. తన రక్తం పంచుకుని పుట్టిన వాళ్లే తనకు రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయత స్థితిలోకి కేసీఆర్ వెళ్లారనే అనుకోవాలి. ఎందుకంటే కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేసినంత మాత్రాన కవిత చేసిన ఆరోపణలు పార్టీని బాగా డ్యామేజీ చేశాయి. ఒకప్పుడు చాణక్యుడిగా, వ్యూహాలను రచించడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ కనీసం తన కుటుంబ సభ్యులను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పేగు బంధంతోటే ఆయన కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారని ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. మిగిలిన నేతలను పార్టీకి పంపించిన కేసీఆర్ కవిత విషయంలో ఒక అడుగు వెనక్కు వేసినట్లే అవుతుంది.
మంచిరోజులని భావిస్తే...
నిజానికి ఇకపై ఏ జరిగే ఎన్నికల్లోనైనా బీఆర్ఎస్ దే విజయం అని భావించారు. తాను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్నప్పటికీ తనపట్ల ఆదరణ, ఇమేజ్ చెక్కు చెదరలేదని నమ్మారు. కానీ కవిత ఇష్యూతో ఆ నమ్మకం సడలిపోయింది. ఒకవైపు అనారోగ్యం, మరొకవైపు కుటుంబ పరంగా పార్టీలో తలెత్తిన విభేదాలు కేసీఆర్ ను మరింత కుంగదీస్తున్నాయనే అనుకోవాలి. ఈ ఘటన కేవలం కుటుంబంతో సరిపోదన్నది ఆయనకూ తెలుసు. భవిష్యత్ లో నేతలు ఎవరూ తనను కేర్ చేయరన్న విషయమూ ఆయనకు అర్థం అయింది. పార్టీ పై పట్టు చేజారిపోతున్నట్లే కనిపిస్తుంది. కఠిన నిర్ణయం తీసుకోలేక.. చూస్తూ ఉండలేక ఫామ్ హౌస్ లోనే గులాబీ బాస్ మదనపడుతున్నాడు.
కవిత విమర్శలతో...
తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఆటోమేటిక్ గా తన వైపునకు మళ్లుతుందని, విజయం తధ్యమని భావించారు. అందుకే ఆయన అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాకుండా దూరంగా ఉన్నారు. కానీ కల్వకుంట్ల కవిత కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పడంతో ఉన్న ఇమేజ్ అంతా ఒక్కసారిగా పడిపో్యింది. హరీశ్ రావు, సంతోష్ రావుల కన్నా కేసీఆర్ కే ఈ విషయంలో ఎక్కువ చెడ్డపేరు వచ్చిందని చెప్పాలి. కల్వకుంట్ల కవితను తొలినాళ్లలోనే కంట్రోల్ చేసి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండకపోవచ్చని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. శృతి మించిపోయే వరకూ వేచి ఉండటంతో జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, దీని నుంచి బయటపడటం ఇక కష్టమేనని అంటున్నారు.
కోటరీ అవాస్తవమే...
నిజానికి కవిత ఆరోపించినట్లుగా కేసీఆర్ ఎవరి మాట వినరు. ఎవరో చెబితే ఆయన తన నిర్ణయాన్ని అమలు పర్చే రకం కాదు. తనకంటూ ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ప్రకారమే కేసీఆర్ వెళతారు. హరీశ్ రావు కానీ, సంతోష్ రావు కానీ, జగదీశ్ రెడ్డి కానీ ఆయన నిర్ణయాలను అమలు పర్చేవారే. అంతే తప్ప ఆయనను ప్రభావం చేసే శక్తి ఎవరికీ లేదు. అందుకే కవిత చేసిన వ్యాఖ్యల్లో ఆయనను ఎవరో మభ్యపెడుతున్నారని కానీ, లోబర్చుకున్నారని కానీ తెలంగాణ సమాజం భావించే పరిస్థితి ఉండదు. రక్తపు చుక్క పడకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కేసీఆర్ రక్త సంబంధంతో ఇప్పుడు తన పార్టీకే ముప్పు తెచ్చుకున్నారన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.
Next Story

