Fri Dec 05 2025 06:21:06 GMT+0000 (Coordinated Universal Time)
KCR : కేసీఆర్ బయటకు వచ్చేది అప్పుడేనట.. అప్పటి వరకూ వెయిట్ చేయాల్సిందే
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో దూరంగా ఉండాలని నిర్ణయించిన కేసీఆర్ భవిష్యత్ ప్రణాళికపై కూడా నేతలతో ప్రతిరోజూ చర్చిస్తున్నారు. హరీశ్ రావు లండన్ నుంచి వచ్చిన తర్వాత ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు. కల్వకుంట్ల కవిత విషయంపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కూడా చర్చిస్తున్నారు. ఈ నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండటంతో విజయం దక్కించుకోవడంపైనే ఆయన చర్చలు జరుపుతున్నారని సమాచారం. తన కుమార్తె కవిత ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చిస్తున్నారు.
సీబీఐ విచారణపై..
కాళేశ్వరం విషయంలో సీబీఐ ఏం చేస్తుందన్నది ఇప్పుడు బీఆర్ఎస్ లో చర్చ జరుగుతుంది. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి, కేంద్ర హోం శాఖకు లేఖ రాసింది. అయితే సీబీఐ ఇంత వరకూ నిర్ణయం తీసుకోలేదు. సీబీఐ విచారణకు స్వీకరిస్తుందా? లేదా? అన్నది తెలియలేదు. సీబీఐ విచారణకు కోర్టు అడ్డంకులు కూడా లేవు. సీబీఐ డైరక్టర్ కూడా హైదరాబాద్ వచ్చి స్థానిక అధికారులతో మాట్లాడారు. ఏం మాట్లాడారు…. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు ఎప్పుడు అంశంపై ఆదేశాలు ఇచ్చారా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ ఆయన పర్యటన బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠకు కారణం అవుతోంది. సీబీఐ ఎంట్రీ ఇస్తే ఏంచేయాలన్న దానిపై కూడా సమాలోచనలు చేస్తున్నారు.
అప్పుడే జనంలోకి...
అయితే కేసీఆర్ మాత్రం ఇప్పట్లో జనంలోకి వచ్చే అవకాశాలు లేవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా ఆయన జనంలోకి రారన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఆరోగ్య సమస్యల దృష్ట్యా కేసీఆర్ మరికొద్ది రోజులు ఫామ్ హౌస్ లోనే ఉంటారని, బయటకు రారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేత ఒకరుచెప్పారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనైనా పర్యటించాలని నేతలు కేసీఆర్ ను కోరుతున్నారు. అప్పుడే పార్టీలో జోష్ పెరుగుతుందని అంటున్నారు. అయితే దీనిపై కేసీఆర్ నుంచి స్పష్టమైన సంకేతాలు మాత్రం రావడం లేదు. ఏదైనా ఉప ఎన్నికలు వస్తే తప్ప ఆయన ఇపట్లో బయటకు వచ్చే అవకాశం లేదని, స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణ మొత్తం కేటీఆర్ చూసుకుంటారని కేసీఆర్ నేతలకు చెబుతున్నారని తెలిసింది. మరి చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.
Next Story

