Fri Dec 05 2025 13:20:33 GMT+0000 (Coordinated Universal Time)
Flash Floods In Telangana : ముప్ఫయేళ్లలో ఇలాంటి వరదలు చూడలేదట... రికార్డు స్థాయిలో భారీ వాన
ఫ్లాష్ ఫ్లడ్స్ తో కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీగా నష్టం జరిగింది. మెరుపు వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఫ్లాష్ ఫ్లడ్స్ తో కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీగా నష్టం జరిగింది. మెరుపు వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఉదయం కూడా భారీ వర్షం పడుతోంది. ఈ రెండు జిల్లాల్లో ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మరొకవైపు అనేక గ్రామాలు ఇంకా జలదిగ్భంధనంలోనే చిక్కుకున్నాయి. గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కామారెడ్డి పట్టణంలో ఇంకా వరద నీరు కొనసాగుతుంది. రహదారి మార్గాలు మూసుకుపోవడంతో సహాయక చర్యలు అందించాలన్నా సహాయక బృందాలకు కష్టంగా మారింది. రహదారులు ధ్వంసం కావడంతో వాహనాలు కూడా వెళ్లే పరిస్తితి అక్కడ కనిపించడం లేదు.
వరద నీటిలో చిక్కుకున్న వారిని...
కామారెడ్డి జిల్లాలోని బీబీపేట్ మండలం యాడారం చెరువులో తొమ్మిది మంది చిక్కుకుపోయారు. పొలం పనులకు వెళ్లిన వారు భారీ వర్షాలకు తిరిగి ఇంటికి చేరుకోలేకపోయారు. వ్యవసాయ బావుల వద్దకు వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో వారి ఇళ్లలో ఆందోళన నెలకొంది. తమ వారిని రక్షించాలని కుటుంబ సభ్యులు అధికారులను కోరుతున్నారు. నిన్న ఉదయం పది గంటలకు చెరువు మధ్యలోకి వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. చివరకు సహాయక బృందాలు బోట్ల ద్వారా చేరుకుని వారిని సురక్షితంగా గ్రామంలోకి తీసుకుని రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
జాతీయ రహదారిపైకి కూడా...
కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లే నేషనల్ హైవే ను నిన్న మూసివేవారు. జంగంపల్లి వద్ద భారీగా వరద నీరు రోడ్డుపై నుండి ప్రవహిస్తున్న నేపథ్యంలో రోడ్డును మూసివేసిన అధికారులు ఇటు వైపు రావద్దని సూచిస్తున్నారు. దాదాపు పాతిక కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారిపై నిన్న రాత్రి నీరు ప్రవహించడంతో జాతీయ రహదారిని మూసివేశారు. కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట పొలాలన్నీ నీట మునిగిపోయాయి. వరి, మొక్క జొన్న పంటలు ఎందుకూ పనికి రాకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముప్ఫయేళ్లలో ఎప్పుడూ ఇలాంటి వరదను చూడలేదని చెబుతున్నారు.
Next Story

