Fri Dec 05 2025 12:39:26 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత : ప్రముఖుల సంతాపం
ఆయన హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కొత్తకోట దయాకర్ రెడ్డి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా..

మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కొత్తకోట దయాకర్ రెడ్డి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని పరకాపురం. ఆయన మూడుసార్లు టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అమరచింత నుండి రెండుసార్లు, మక్తల్ నుండి ఒకసారి గెలుపొందారు. కొత్తకోట దయాకర్ రెడ్డి మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తదితరులు సంతాపం వ్యక్తం చేసి, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
"మక్తల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కొత్తకోట దయాకర్ రెడ్డి గారి మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించింది. తెలుగుదేశం పార్టీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన దయాకర్ రెడ్డి గారు... నిత్యం ప్రజల్లో ఉంటూ సమర్థుడైన నాయకుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఆత్మశాంతికై ప్రార్ధిస్తూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను." అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
Next Story

